Rajaram Thumucharla

Rajaram Thumucharla

“తప్పిపోయిన ఆమెను కవిత్వ దర్పణంలో చూపిస్తున్న కవయిత్రి రాధికా మోహన్ “

`
రాజారామ్.

“నాలో కనబడేవి మూడక్షరాలు మాత్రమే
కానీ కనబడని మనసులెన్నిటినొ
నాలో చూపెడుతూ నేనొక అద్దంగా
మారుతూ ఉంటాను” ( కవిత్వం)

కవిత్వాన్ని అద్దంగా చేసుకోగలిగే సత్తా వున్న వో కవయిత్రి ఈ మధ్యనే చదివాను. గడ్ద కట్టుకపోయిన కన్నీటిని బొట్లు బొట్లు గా కరగించి చూసిన దృశ్యాన్ని కవిత్వంగా తర్జుమా చేయగలిగే భావుకత్వ శబలత వున్న కవయిత్రి ఈమె.

అమ్మ పాల భాష తొ తన తండ్రిని, తన అమ్మ చిత్రాన్ని,సంక్షోభ స్త్రీ హృదయాన్ని, రాలిపడుతున్న సమయాల్ని,తన జ్ఞాప శకలాలు వొక్కొక్క దాన్ని కవిత్వంగా మారుస్తున్న కవయిత్రి ఈమె.

“I am not alone” – అంటూ అవ్వపాల భాషతో “అసిఫా మాట్లాడితే..” ఎలా వుంటుందో కవిత్వం చేస్తూ.. జీవితంలో అందరు చేయాల్సిన ‘ Block minutes ‘ ఏవో కలం వారసులు ఎవరో వారికి తెలియ చెప్పిన కవయిత్రి ఈవిడ.ఆవిడ ఎవరో కాదు శ్రీమతి గట్టు రాధికా మోహన్ గారు.వెంకీ అనే కలం పేరుతో కవిత్వం రాస్తున్నారు.

మా అమ్మాయి ఏదైన తిన్నప్పుడు పక్కనేవున్న వాళ్ళమ్మ పైట చెంగుతూ మూతి తుడుచుకోవడమో చేతులు తుడుచుకోవడమో చేస్తుంటుంది. అప్పుడు నా సిరి అట్లా మూతినో చేతుల్నో తుడుచుకుండే ఆ అమ్మాయిని కసురుకొంటూ ఎప్పుడు మానుకుంటావే ఈ బ్యాడ్ హ్యాబిట్ అని..చిరాకుపడుతూవుండటం చూసిన నాకు…’అమ్మకొంగు’ బిడ్డకు ఎట్లా ఉపయోగపడుతుందో రాధిక మోహన్ గారు చిత్రించిన ఒక కవిత గుర్తొచ్చింది. ముర్రిపాలనిస్తూ మొదటి మురిపాలు కురిపించే అమ్మ కొంగు ఎంత అందంగా కవిత్వంలోకీ వొదిగిందో ఈ కవితలో చూడండి.

“చలి జ్వరంతో
నా చలనమాగుతున్నప్పుడు
వెచ్చని దుప్పటిగా మారింది
అమ్మ కొంగు
దొంగాటాడుతున్నప్పుడు
రక్షణగా నిలిచేది అమ్మకొంగు
గాయమైనప్పుడు
గాభరపడుతూ తుడిచేది అమ్మ కొంగు “

ఇట్లా అమ్మ కొంగు ఎండకు వానకు రక్షించే గొడుగైనప్పుడు తడిచిపోయే అమ్మే అన్న విషయాన్ని రాధికమోహన్ గారు మాతృమూర్తి మౌన బాష్పాలను ,పేగు పంచిన తల్లి చల్లని హృదయాన్ని ఒక మహాశిల్పిలా కవిత్వంగా చెక్కారు.

చదువుల వొత్తిడితో తల్లిదండ్రులు తమ పిల్ల అభివృద్ధిని కోరుకుంటున్నారో లేక అభిరుచుల్ని చంపేస్తున్నారో అనే విషయాన్ని “ నువ్వొక పొడిచే పొద్దువి ‘ – అనే కవితలో చదువరులకీ యాది చేస్తుంది.

“నువ్వు యాదొచ్చినప్పుడల్లా నా గుండె
వరదల్లో గల్లంతైన పడవుతది.
నా కండ్లకీ వెలుతురైన నీ అల్లరి
అథితిలా వచ్చిపోతుంటే
కనబడని చీకటి
మనసంతా పరుచుకుంది
ఈ లోకాన్ని సూపించడానికీ
నా నుండి ఓ పేగు వేరు చేస్తే
ఆశలతో ఆకాశన్నంటించే స్టడీ జైల్లు
నిన్నొక దిష్ఱి బొమ్మను చేసి
నీ నుండి నన్ను వేరు చేస్తున్నవి “

తల్లో తండ్రో వొచ్చిన కూడా పలకరించడానికీ కాదు కదా తమ పిల్లల్ని చూడటానికీ కూడా అనుమతించని కార్పోరేట్ సంస్కృతిని ఈ కవయిత్రి చూపించడమే కాక తల్లికీ ఆమె బిడ్డకీ వున్న పేగు బంధపు అనుబంధం తెగిపోతున్న దృశ్యాన్ని స్ఫురింపచేస్తుంది.

“నా చేతుల్తో పాదులు తీసే స్వప్నంలో
నీళ్లు పోస్తున్నానో…!
వేళ్ళు తీస్తున్నానో..!! “

ఈ మాటల్లో డాలర్ల వేటలో ఆశల కొమ్మలపై కూర్చున్న అమ్మా నాన్న తమ వైపు వున్న కొమ్మను నరుక్కొని తమ అద్దంలో పొడిచే పొద్దయిన బిడ్డల్ని చితికే చీకటిలోకి నెట్టి వేసే సంస్కృతిని చిత్రించింది రాధికామోహన్ గారు.

కవులో కవయిత్రులొ తమ ఎరుక లోని సామాజిక సంఘటనల్ని కవిత్వంగా మార్చడంలో తమదైన అద్భుతమైన నేర్పును సరికొత్త శిల్పంతో చదువరులు ఆ సామాజిక సంఘటనని తమ కన్నుల్లోకి ఒంపుకోవడానికో ఒంపుకున్న రూపాన్ని , గుండెల్లో నింపుకోడానికీ ఏదో ఒక రూపాన్ని ఎన్నుకోక తప్పదు.

ఈ కవయిత్రి కాశ్మీర్ లో అసిఫా అనే ఎనిమిదేళ్ళ అమ్మాయిని ఒక దేవాలయంలో ఎనిమిది రొజుల పాటు అత్యాచారం చేసి క్రూరంగా చంపిన సంఘటనను సరికొత్త సంభాషణాత్మక శైలిలో ఒక సరి కొత్త శిల్పాన్ని ఎన్నుకొని అసిఫానే రాసినట్టుగా ఒక లేఖాత్మక పద్దతిలో అసిఫా పడిన వేదనకు అక్షర రూపమిచ్చింది.

ఈ వొక్క కవిత చాలు తప్పిపోయిన ఆమెను ఈ కవయిత్రి గొప్పగా ఆవిష్కరించిందని చెప్పడానికీ. “అసిఫా మాట్లాడితే” ఎలా వుంటుందో తన కవిత్వ అద్దంలో చూపింది రాధిక మోహన్ గారు.ఒక గొప్ప కవితను చదివిన అనుభూతి ఇస్తూ కన్నీటిని స్రవింప చేస్తుంది ఈ కవిత. రక్తాన్ని గడ్డకట్టించే ఈ విషాద సన్నివేశాన్ని రాధికా మోహన్ గారు నిసర్గ శిల్పంతో నిరలంకారంగా …ఏ ట్రోప్స్ వాడకుండానే మన హృదయమ్మీది పెంకులు పగిలిపోయేలా రాశారు.

తనను ఏదేదో చేస్తున్న వాడిని గురించి అసిఫా బాధని ఇట్లా చెక్కింది ఈవిడ,

“అమ్మ.. అమ్మా..
నేను కదా నీ మీద పడుకుంటే
నువ్వు జొకొట్టేదానివి
వీడేంటమ్మా మన గుర్రం కన్నా పెద్దగా వున్నాడు
నేను గుర్రానెక్కి ఆడుకుంటే
ఈ గుర్రమేమో నా మీద పడుకుంటుంది.”

ఇలా తన మీద పడి బట్టల్ని చింపేసీ తనని ఎక్కడెక్కడో వొత్తుతున్న మగ మృదం చేసే చేష్టలు అర్థం కాక రక్త స్రావంలో స్నానం చేయించబడ్డ అసిఫా మనసులోనే అరిచి అరిచి ఏడ్చి ఏడ్చి తన అమ్మ నాన్నకు లేఖ రాసినట్టుగా రాసిన కవిత మన కళ్లకు కన్నీటి కావళ్లను కట్టించడమే కాదు ఈ రాజ్యానికున్న మత విద్వేషపు కుట్రని బయల్పరుస్తుంది.

“ ఆడమగ అంటే ఏంటిదమ్మా..” – అనే వాక్యంతో మొదలయ్యే ఈ కవిత స్త్రీని తమతో సమానంగా చూడలేని మేల్ చ్యూవనిజాన్ని చూపిస్తుంది. ఒక పసి మనసు ఆ పాశవిక అమానుషానికీ గురయినప్పుడు పొందిన రంపపు కోతని కవయిత్రి ఇట్లా చెబుతుంది.

“నేనాడపిల్లనట
వీడేమో మగాడట
మొనగాడట
ఇదేదో వాని మగతనమట
లోపలికి నెట్టుతూ విర్రవీగుతున్నాడు,”

ఇట్లాంటి దుర్మార్గ వ్యవస్థలో గులాబీల్లాంటీ ఆడ పిల్లలు జీవించలేని స్థితిని చెప్పడానికేమో ఈ కవయిత్రి అసిఫా తో ఇట్లా అనిపించింది.

“ఆడోళ్ళందరిని తీసుకొచ్చేయమ్మా
ఎవడొ వొచ్చి ముండ్లు గుచ్చి
బండరాళ్ళతో తలను పగులగొట్టకముందే “

మనల్ని కదిలించి కన్నీటి తడితో తడిపే కవిత ఇది. “నాలో ఏమున్నది వాళ్ల కామం తీరడానికి..” అన్న వాక్యం కవితకంతా కీలకమై ఏమీ తెలియని శైశవదశలో వున్న అసిఫా లాంటి పాపల మీద అకృత్యాలకు పాల్పడే వాళ్లమీద క్రోధం అక్కసు జుగుప్స కలగలసీ మనలో ఏర్పడేలా చేస్తుంది.ఇదే కవిత్వ ప్రయోజనం.

స్త్రీవాద ప్రవాహం ఆగిపోలేదు.అది అంతర్వాహినిగా ప్రవహిస్తూనే వుంది అంటారు ప్రముఖ కవయిత్రి విమర్శకురాలు శ్రీమతి శిలాలోలిత గారు. ఈ కవయిత్రి కవిత్వంలో కూడా ” ఆమె” వస్తువు అవ్వడంలో ఉద్దేశ్యం కూడా స్త్రీ వాదమే అని కవిత్వమంతా చదివితే తెలుస్తుంది. అందుకే చాలా కవితల్లో “ఆమె” కనిపిస్తుంది.

ఇతిహాసపు ‘ఆమె’ అయినా ఈనాటి ‘ఆమె’ అయినా కారుమబ్బుల కలవర దుప్పటిని ఒళ్లంత కప్పుకొని ఆశల పల్లకీలో ఊరేగే సుతిమెత్తని గొంగళి పురుగు అని కవయిత్రి రాధికా మోహన్ గారు “ఆమె’ను పోల్చారు.

అడుగడుగునా అవమానాల తొడుగులేసుకొని ,అనుమానపు ముండ్ల కిరీటాల్ని మోస్తూ నయవంచనకు గురవుతున్నది ఒక గొంగళి పురుగులా జీవితాన్ని మోస్తున్న ‘ఆమె’ ఏదో ఒక రోజు స్వేఛ్చ లా ఎగిరే సీతా కోక చిలుకలా మారి ఈ సమాజపు ఆకాశంలో స్వేఛ్చగా జీవించగలుగుతుందనే విశ్వాసం ఈ కవయిత్రి వ్యక్తం చేస్తుంది. ఆమెకు ప్రకృతికీ అభేదాన్ని కొత్త ఊహతో తన కవిత్వ అద్దంలో ఇట్లా ప్రతిబింబింప చేస్తారు చూడండి.

“ఆమెలో కరిగిన కళలే కదా
ఆ ఇంధ్ర ధనుస్సు వర్ణాలు
ఆమెలో నిక్షిప్త నిస్వార్థతే కదా
ఆ నిర్మల నీలాకాశం..
ఆమెలోని ఓపికకు చిరునామే కదా
ఈ పుడమి తల్లి “

ఇట్లా ఆకాశంలో ధగ ధగమని మెరిసే నక్షత్రాలు ఆమె ప్రేమకు చిహ్నాలని, ఆమెలోని విఛ్చిన్న విషాదమే ఈ అమావాశ్యపు చీకట్లని, ఆమె నుండి కారిన కన్నీరే ఈ మహాసముద్రాలని చెబుతూ ఆమె ఆశలను ఆవిరి చేస్తే సునామీలా రగిలి తిరగబడుతుందనే స్పృహనిస్తుంది కవయిత్రి.

స్త్రీయే ప్రకృతి ప్రకృతియే స్త్రీ అనే ఒక భావనను చెప్పడానికే కాదు ఈ కవితను కవయిత్రి రాసింది “ ఆమె ‘ ( స్త్రీ ) లోని ఔన్నత్యతను తెలియచెప్పడానికి అయివుండొచ్చు.

మూడక్షరాలలో ఇముడని ఒక అనంత రూపసి దిక్కుతెలియని సందిగ్ధాల కూడలిలో దిక్సూచి అయిన అతన్ని కవయిత్రి మంచి కవిత్వం చేసింది.

అతనొక మహాశిల్పి..
ఉలిదెబ్బల్లోంచి కన్నీరు పెట్టే నన్ను
ధృఢ సంకల్ప శక్తి నాలోకి ఒంపుతూ
అందమైన శిల్పంగా చెక్కుతూ ఉంటాడు
అతనొక మంచు పర్వతం..
తన హృదయాన్నెప్పుడూ కరిగిస్తూ
పేగు పంచని తల్లియై
చల్లని ప్రేమను కురిపిస్తూ ఉంటాడు..
అతనొక సూర్యుడు..
నా దారుల్లో వెచ్చని వెలుగు
కిరణాలను పరిచి
నన్ను దీపం చేస్తుంటాడు”

“నా దారుల్లో వెచ్చని వెలుగు కిరణాలను పరిచి నన్ను దీపం చేస్తుంటాడు” అని అనడంలో అతని పై ఆమె ఆధారపడిందేమో అన్న భావన కలిగే అవకాశం వుంది. కానీ కవయిత్రి ఉద్దేశ్యం అదికాకపోవచ్చు. స్త్రీ పురుషుల సమాహారం ఈ సమాజం అని చెప్పడానికీ,స్త్రీ పురుషుల మధ్య వుండవలసిన పోషించుకోవలసిన సదావగాహను గుర్తు చేయడానికీ ఈ కవిత రాధిక మోహన్ గారు రాశారనుకుంటా.

ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ ఈమె కవితల్లోని భావస్ఫోరకత కవిత్వ ప్రేమికుల్ని కదిలింప చేస్తుందని అంటాడు.ఆ మాటలు అక్షరాల నిజాలు.ప్రముఖ విమర్శకుడు కవి కవిత్వ నిర్మాణ రహస్యాల్ని బయల్పరుస్తున్న లక్ష్మినరసయ్య గారు తక్షణ భీభత్సానికీ తనదైన కవిత్వ స్పందన ఈ కవయిత్రి బాణీ అని అంటున్నాడు.సంపుటిలో ఇలాంటి కవితలే ఎక్కువగా వుండటం ఈ మాటలకు కారణం కావొచ్చు. ప్రముఖ కవి యాకూబ్ గారు దౌర్జన్యాల సమాచారం మాత్రమే ఈ కవయిత్రి కవిత్వం చేయలేదు.దౌర్జన్యాలకు గురైన బాధితుల ఆవేదన పాఠకుల్లో సృష్టిస్తారని అన్నారు. ఇందుకుదాహరణ “ అసిఫా మాట్లాడితే” అనే కవిత.

రాధిక మోహన్ గారు వొక గట్టు మీదనుంచే సమాజాన్ని దర్శించలేదు.ఆవలి గట్టు మీద నుంచి కూడా దర్శించి అనేకానేక సంఘటనల్ని అవి సృష్టిస్తున్న భీభత్సాన్ని కవిత్వంగా మార్చారు. తెలంగాణ స్థానికతను పట్టించే సజీవ భాషలో సమకాలీన సమాజ చరిత్ర ఆధారంగా కవిత్వంగా రికార్డ్ చేసిందని ఈ కవయిత్రి గురించి ప్రముఖ కవి విశ్లేషకులు నారాయణ స్వామి యోగి గారన్నారు.

“ఇప్పుడు.. అమ్మ గర్భం ఒక దుఃఖ సముద్రం “ అనే గొప్ప వాక్యాలు రాయగలిగిన రాధిక గారు తన అమ్మా నాన్నల్ని కవిత్వం చేసి మనముందు నిలిపారు. ఎలిజీ ని గొప్పగా నిర్మించగల కవిత్వ నైపుణ్యం ఈవిడలో పుష్కలం.’ మా నాయిన ‘ – అనే కవిత చూడండి.

“అమ్మ మురుపాలకు
దూరమైనందుకో
ఆఖరిదాన్నయినందుకో..గని
గొల గీసిన పాలను
సను బాలోలే తాగించేటోడు
నన్నెత్తుకోని ముద్దాడితేనే
పొద్దాక పడ్డ కట్టమంత
ఐస్ ముక్కోలే కరిగిపోయేదట
నా పెయ్యంత జరమొచ్చి
కాలిపోతాంటే
నాయిన మనసంత ఎడారై
గుడ్ల్ల సినుకులు మొలిసేవి “

ఈ కవితలో తండ్రితో వున్న అనుబంధాన్ని చిత్రించడమే కాదు ఈ కవయిత్రి తన తండ్రి తనకు కొడుకై కడుపున పుట్టి కవిత్వమవుతున్నాడన్న మంచి ముగింపుతో.. ముగించింది.అమ్మ చిత్రాన్ని కవిత్వంలోకి తెచ్చింది.

కవయిత్రి తొలి కవితా సంపుటైనా తన సంపుటిలో మంచి కవిత్వాన్ని అందించారు గట్టు రాధికా మోహన్ గారు. వచనమై తేలిపోయే కవితలు ఇందులో లేవని చెప్పడంలేదు. కవిత్వ రహస్యాన్ని తెలుసుకున్న కవయిత్రి ఈవిడ. భావానికి తగ్గ భాష వుంది. ఊహల్ని చాంపేయమాలలుగా మార్చగలిగే భావుకతవుంది. సంఘటనపట్ల తక్షణ స్పందన వుంది.శిల్పాన్ని తన అధ్యనంతో మెరుగుపరుచుకోగలితే.. ఒక మంచి కవయిత్రి తెలుగు కవిత్వ నది గట్టు మీద నిలబడగలదన్న ఆశ నాకుంది.ఆవిడ ఊహ చాతుర్యానికీ ఈ వాక్యాలు వొక ఉదాహరణ.

“ఆకాశం తన నీలిరంగు వాకిలిని
నల్లమట్టితో అలికి చుక్కల ముగ్గులు
పెడుతున్న వేళలో.. “

“ఆకాశం కు ఒంటి నిండా మచ్చలే
సొరియా సిస్ ఏమైనా సోకినట్టుంది”

ఈ తరం మహిళా స్వరంలో స్త్రీవాదాన్ని ఎట్లా వినిపించాలో అట్లానే ఈ కవయిత్రి వినిపిస్తున్నదనే అఫ్సర్ మాటల్తో ఏకీభవిస్తూ… భవిష్యత్తులో మరింత మంచి కవిత్వాన్ని రాధికామోహన్ గారు అందిస్తారన్న ఆశతో.. రాస్తున్న క్షణాల్ని block, చేసీ విధుల్లోకి వెళ్ళడానికీ తరువాత క్షణాలకు lock తీసీ..ముగిస్తున్నా.

( ఈ వారం కవితాంతరంగంలో “ ఆమె తప్పి పోయింది..” కవితా సంపుటి కవయిత్రి శ్రీమతి గట్టు రాధికా మోహన్ గారు )[/vc_column_text][/vc_column][/vc_row]

No Comments

Post A Comment

You don't have permission to register