Porshia Devi

Porshia Devi

// నిరంతరం//
————————పోర్షియాదేవి
.
అలకెందుకో అలసటే వుండదు
అట్టిపెట్టుకుందామని ఆలోచించని ఒడ్డుని
పరుగాపకుండా తడుపుతూనే వుంటుంది
మరి మనసుకెందుకా ఆలోచన ఉండదు
బదులు కావాలని కోరుకుంటూనే వుంటుంది
.
అయినా మనసేమైనా నీటి చెలమ కాదు కదా
నీరంతా తోడేసుకున్న తరువాత మళ్లీ వూరడానికి
అదెప్పుడూ ముట్టుకుంటే ముడుచుకుపోయే టచ్ మీ నాట్
అందుకే అలజడులు తట్టుకోలేక తల్లడిల్లుతుంది
.
అసలు ప్రకృతి ధర్మాలు ఎంత బాగుంటాయి
సమయం రాగానే ఫల పుష్పాలను అందించే చెట్టుచేమలూ
నిర్ధాక్షణ్యంగా త్రుంచి వేయబడుతున్నా,
తన పాదం మీదే పడి నశించిపోతున్నా
చివురంత బాధ లేకుండా చిగురిస్తూనే ఉంటాయి
బహుశా వాటికి మనసుండదేమో కదా
.
ఎప్పుడూ పుడమికి అమృతాన్నిచ్చే మబ్బులు
అప్పుడప్పుడు ఉరిమి నిప్పు కణికలను వర్షించినా గాని
నేల నిండుగా సుగంధాలను వెదజల్లుతూనే ఉంటుంది తప్ప
అలిగి అల్లరి చెయ్యదుగా,
అందుకేగా భూదేవంత సహనం అనేది
.
కొన్ని కలలు ఇంకొన్ని ఊహలు కలిసి
నిజాలతో పెనవేసుకున్న జీవితమిది
వ్యతిరేకతలను , తిరస్కారాలను కలగలిపి గమనం సాగించడం తప్పదు
గుండెకున్నట్టు మనసుకీ అరలుంటే ఎంత బాగుండేది
భావాలన్నీ అరలలో సర్ది భావరహితంగా బ్రతికేయవచ్చు.

No Comments

Post A Comment

You don't have permission to register