Kusumkumar Dakoju

Kusumkumar Dakoju

## #ఎనిమిదోఅడుగు

నీతో
ఏడడుగులు నడిచాక
నీ అడుగులను అనుసరించడమే
నా జీవనధ్యేయం!

అలాంటి నువ్వు..
నీ ఊపిరొదిలి
మువ్వన్నెల రెపరెపలకు
జీవం పోశావు!

నీ ధైర్యసాహసాలతో
దేశ శౌర్యాన్ని ఇనుమడించావు!

నువ్వు అమరత్వాన్ని పొందాక!
హిమనగాలపై నువ్వేసిన
ఎనిమిదోఅడుగు నన్ను తక్షణం రమ్మంటోది!

ఇక భయపడేదేమి లేదు
ఆ ఎనిమిదోఅడుగు
సైనిక జీవితం తొలిఅడుగేయమంది!

ఇప్పుడు నా నుదుటిపై
మూడుసింహాలు!
కనబడని నాలుగోసింహంలా!
నా వెనుకే నువ్వు!

ఇప్పుడు నువ్వు నేలకొరిగినచోట!
మువ్వన్నెలజండా
పైకెగరేస్తూ నేను!

ఆ రెపరెపల్లో నీ నవ్వులు
ఏరుకుంటున్నాను!
అక్కడే ఘనీభవించిన
నీ ఆఖరిమాటలను!
నీ వెచ్చనితలపులతో కరిగిస్తున్నాను!

ఇప్పుడు నీవ్విక్కడొదిలిన మలిశ్వాస!
వెచ్చగా నన్ను తాకుతూనే ఉంది!

ఇదంతా..
ప్రియమైన నీతో
నేను చేసే సహగమనమే!

(భర్త అమరజవానయ్యాక
ఆయన డ్యూటిలో చేరిన
ధీరవనిత #శ్రీమతిగౌరిప్రసాద్
గారికి బాసటగా)

#కుసుమకుమార్ #దాకోజు
27/02/2019

No Comments

Post A Comment

You don't have permission to register