Krishna Guguloth

Krishna Guguloth

# * * రాకాసి జలగలు * * #

టేథిస్ ఆవేదనగా ఆవిరౌతూ
ఆక్రందన పర్వతాలుగా తనని
తాను వెదజల్లుకుందేమో !?

ఈ ధవళపర్వతాల సానువుల్లో
ఏడజూసిన మనిషితనపు ఆనుపానుల్ని
లగ్గెత్తించి లగ్గెత్తించి అతికిరాతకంగా ఏటాడిన
నరమేధాల శిలాజాలాలే త్రాహీ ! దేహీ ! యని
సాగిలబడుతుంటాయి

మధ్యయుగపు మౌఢ్యపు
రాకాసిబల్లుల రక్తదాహార్తి రణక్షేత్రంగా
ఎంటాడితే కొన్నిరేకుల్ని దేశదిమ్మర్లుగా
విరజిమ్ముకొని వన్నెకోల్పోయిన తెల్లగులాబీ ఇది

తెగబలిసిన స్వార్థపు కోడెగిత్తల
కుమ్ములాటలో నలిగి నుజ్జవుతున్న లేగదూడయై
బూర్జువా బాహుబలుల సుల్తానుల శౌర్యాలకు
వేదికయై ఆపై గద్దెలకు సోపానమవుతుంది

రక్తచెలిమలై తెగిపడ్డ అంగాలతో
రక్తపుటేరుగా పారిన మానంతో ..
కండ్లల్లో వేదనా అగ్నిపర్వతాల్ని మోసుకుంటూ
గుండెలపై కన్నీటిలావాల్ని ఎగజిమ్ముకుంటూ చుట్టూ
చేర్చబడిన శవపేటికల చితుల చుక్కలపై రంగుల ముగ్గులైన శవాల స్మృతులకు ఎక్కిళ్ళుబడ్తూ ..

ఏనాడో జీవచ్ఛవమైన కాశ్మీరతల్లీ
జీర్ణదేహపు రక్తాన్నే జీవధారగా చేసుకొని
నేటికి జీవం పోసుకుంటూనే ఉన్నాయి
రాకాసిజలగలు

No Comments

Post A Comment

You don't have permission to register