Juned Ahamad

Juned Ahamad

/బ్రతుకు జట్కా బండి/

ఆకాశం వైపు అబ్బురంగా మా చిన్నారి చూపు…
విమానమొచ్చిందోచ్ అంటూ కేకలు….
ఆకాశ ప్రయాణికులకు చేయి ఊపుతూ వీడ్కోలు

రైలును చూడగానే ఒకటే గంతులు
రైలు ప్రతి పెట్టేకూ తన కనుల స్టేషన్ లో కొలువు
ప్రతి ప్రయాణికునికీ గుడ్ బై అంటూ చిట్టి చేతులు

విమానమైనా రైలు అయినా
కనులను దాటుకుంటూ వెళ్తుంటే
ఓ చిన్న నిట్టూర్పు….ఓ చిన్ని కన్నీటి చుక్క

ఎక్కాలనో… మరి బండి వెళ్లిపోయిందనో
ఇప్పటికీ తెలియదు నాకు.
నేనూ అడగలేదు తనూ చెప్పలేదు

తను పెరిగి పెద్దయ్యాక అడిగాను
నువ్వు రైలు ఎక్కావు విమానమూ ఎక్కావు
ఎలా అనిపించింది… ఏది నచ్చింది అని

ఆమె నవ్వి ఊరుకుంది.
కానీ ఆ నవ్వే ఓ సమాధానంలా తోచింది.
ఊహ అంత తీయ్యగా నిజం ఎప్పటికీ ఉండదు అని
బ్రతుకు జట్కా బండిలోనే అన్ని బళ్ళు భాగమని…

ఆనందమేసింది మా చిన్నారి జీవితాన్ని చదివేసిందని

No Comments

Post A Comment

You don't have permission to register