Geeta Vellanki

Geeta Vellanki

### ఒకప్పుడొక సైనికుడుండేవాడు###

అతడు 
నిజం తుపాకీనే ధరించేవాడు

కళ్ళల్లో
దయా, జాలీ కనపడకుండా
టోపీ ధరించేవాడు

ముఖంలో
నవ్వు కానరానియ్యకుండా
అడ్డంగా శిరస్త్రాణం పెట్టుకునేవాడు

తననెవరూ గమనించకుండా
చెట్లు పుట్టలలో కలిసే బట్టలు వేసుకునేవాడు

గంటలతరబడి
ఊపిరి బిగబట్టి
స్వేదాన్నీ, రక్తాన్నీ ప్రవహించకుండా ఆపేసేవాడు

ఎండనకా, వాననకా
కొండల్లో, గుట్టల్లో
రేయీ పగలూ…
పోరాటానికి సన్నద్ధంగా ఉండేవాడు..

అతడికి కాలం
ఘనీభవించి ఉంటుందెపుడూ
అతడికి
కుటుంబం అంటే దేశం మొత్తం!

తను చేసిచ్చిన
కాగితప్పడవ ఇంకా పిల్లలు దాచిపెట్టారనీ
తనతో గడిపిన క్షణాల్ని
సగభాగం మళ్ళీ మళ్ళీ నెమరేసి చూసుకుంటుందనీ
వాళ్ళందరికీ తను మాత్రమే లోకమనీ…
తెలియదా అతడికి?

తెలిసినా
ఇప్పడది అప్రస్తుతం
అతడిక గతం…

ఇప్పుడు
అందరూ చెప్పుకుంటున్నారు
ఒకప్పుడు
ఇక్కడొక సైనికుడుండేవాడు…. అని!

No Comments

Post A Comment

You don't have permission to register