Afsar Mohammed

afser mohammed

Afsar Mohammed

మౌలిక భావనలు: 10
~
కవిత్వ వివక్ష మీద ధ్వజమెత్తిన ఆమె! 
*

అంతిమంగా కవిత్వం ఏం చేయాలి? వివక్ష మీద ధ్వజమెత్తే నిరసన పాఠం కావాలి, అంతేకాని, అదే వివక్షని పెంచి పోషించే సాధనం కాకూడదు. అయితే, ప్రధాన స్రవంతి పేరుతో కవిత్వలోకంలో సాధారణంగా ఇంకో రకం వివక్షని కవులే నేర్చుకుంటారు. తమ భావాలతో పొసగని కవిత్వాన్ని అంటరాని కవిత్వం చేస్తారు. అట్లాంటి ధోరణిపై పోరాడడం నేటివ్ కవిత్వ లక్షణం.

కొంచెం లోతుగా చదువుతున్నప్పుడు అమెరికన్ కవిత్వానికీ, మన తెలుగు కవిత్వ సందర్భాలకూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు-

స్వేఛ్చా, అనేకత్వం రెండూ బలమైన పునాదులు అని నమ్మే అమెరికన్ సమాజంలో వివక్షకి లోటేమీ లేదు. ప్రాంతాన్ని బట్టీ, రంగుని బట్టీ, “మాతృ” దేశాన్ని బట్టీ, రాజకీయ దృక్కోణాల్ని బట్టీ ఇక్కడ వివక్ష కొనసాగుతూనే వుంది. అదే వివక్ష సాహిత్య సమాజంలో కూడా సహజంగానే ప్రతిఫలిస్తుంది. తెలుగు కవిత్వంలో కూడా స్వేచ్చా, అనేకత్వం అనే మౌలిక భావనలు మొదటి నించీ వున్నా, వాటికి సాంస్కృతిక గౌరవం తక్కువ. అంటే, ఆ భావనల్ని ప్రేమించే/ ప్రతిబింబించే కవిత్వం పట్ల మనకొక రకమైన వివక్షే వుంది. అస్తిత్వ వాద సాహిత్యాల పట్ల ప్రధాన స్రవంతి తిరస్కార భావంలో ఈ వివక్ష స్పష్టంగానే కనిపిస్తుంది.

నటాలీ డియజ్..వొక నేటివ్ అమెరికన్. తన తెగకి సంబందించిన ప్రతీకాలతో ఆమె మొదటి సారి రాసినప్పుడు అది కవిత్వం అని ఆమెకి తెలియదు. ఎందుకంటే, అమెరికన్ సాహిత్య సమాజంలో కవిత్వం అంటే తెల్లవాళ్ళదే! వాళ్ళ గుత్తాదిపత్యాన్ని వొప్పుకుంటేనే ఏ వాక్యమైనా కవిత్వమవుతుంది. ఆ వాక్యంలో “కవిత్వం” అంటూ ఏదీ లేకపోయినా అదే కవిత్వమై యూనివర్సిటీలలో, పత్రికలలో మార్మోగుతుంది. అవార్డులు గెలుచుకుంటుంది.

ఆమె కవిత్వం రాస్తునప్పుడు రెండు రకాల వివక్షలు ఎదుర్కొంది. మొదటిది: తెల్ల సమాజంలో వున్నారో లేదో అన్నట్టుండే ఇండియన్ల పట్ల వుండే వివక్ష; రెండు: అన్ని రకాల వివక్షలపై యుద్ధం చేయాల్సిన కవిత్వ సమాజమే ఆమె పట్ల వివక్ష చూపించడం. అంటే, వివక్ష చూపించడం నేర్పే కవిలోకం మధ్య ఆమె నిలబడింది. తన మారుమూల పల్లె పదాలతో, తన గూడు/ గూడెం జనాల ప్రతీకలతో, పదచిత్రాలతో, తన జీవితం మాత్రమే నేర్పించే బతుకు పాఠాలతో!

ఉదాహరణకు ఆమె కవితకి వొక అనువాదం:
*


అమెరికన్ అంక గణితం

నిజమే

మాకు లెక్కలు రావు

అయినా,

మేమెంత మీ లెక్కల్లో?

0.8 అంటే మీలో వొక్క శాతం కూడా కాదు మరి!

కాని,

చావుల లెక్కల్లో

మీ పోలీసు హత్యల్లో

మేం 1.9 శాతం!

అంటే,

వున్న జనం కంటే ఎక్కువ మందిని మీరు చంపుతున్నారనే కదా,

నా ప్రియమైన అద్భుతమైన అమెరికా!

ఇక్కడ రేస్ హత్యలకంటే మా హత్యలే రికార్డు.

అంటే

మేం బతకడంలో కంటే చావడంలో రికార్డు అన్నమాటేనా!?

అవునూ,

రేస్ అంటే పరుగు అని కూడా అర్థం కదా!

ఈ పరుగుల్లో ఈ అంకెల్లో మేం ఎప్పుడూ చివరే.

అమెరికన్ ఇండియన్ మ్యూజియంలో మాత్రం నేనే కనిపిస్తా

అరవై ఎనిమిది శాతం!

నేనొక మ్యూజియంగా మిగిలిపోకూడదని నా కల.

నా ఊపిరి తెగిపోకూడదని నా కల.

దండం పెడతా

నన్ను వొంటరిగానే ఉంచినా పర్లేదు

అదృశ్యంగా మాత్రం వుంచొద్దు!

వద్దు

వద్దు

No Comments

Post A Comment

You don't have permission to register