‎Vamsy Krishna‎

vamsy

‎Vamsy Krishna‎

కవిత్వ ప్రపంచం -68

పచ్చ పచ్చటి వరి పొలాల మీది పసిడి పరిమళం ఆమె అక్షరం

రజని అంటే చీకటి అని అర్ధం. కానీ ఈ రజని తెలుగు కవిత్వం లోకి కొత్త వెలుగును తీసుకుని వచ్చింది . తెలుగు కవిత్వానికి వస్తు విస్తృతినీ , రూప విస్తృతినీ తన కవిత్వం ద్వారా అందించింది . అర్బన్ మిడిల్ క్లాస్ మొరాలిటీ మీది స్త్రీ వాద తిరుగుబాటును భూ మార్గం పట్టించి గ్రామీణ , శ్రామిక జన మూలాలలోకి తీసుకుని వెళ్లి స్త్రీ విముక్తి లోనే సకల మానవ జీవన బాధల ,గాధల నుండి మానవ విముక్తి దాగివుందని కరతలామలకం చేసింది

స్త్రీ వాదం అంటే కనుబొమలు ఎగురవేసిన 1980 దశకం లో తెలుగునాట స్త్రీ వాద తాత్వికత కు సర్వ జన ఆమోదం సాధించి పెట్టిన నాలుగు ఐదు బలమైన గొంతులలో రజని స్వరం ఒకటి . మన గిరీశాల సంస్కృతిని తన పదునైన కలం తో చీల్చి చెండాడింది ఆమె . రజని పేరు చెప్పగానే చాలా మందికి అబార్షన్ స్టేట్మెంటు గుర్తుకు వస్తుంది . అది బలమైన వ్యక్తీకరణ . నిజమే, కానీ అంతకంటే బలంగా రజని కవిత్వ లక్షణాన్ని కూడా ఆ కవిత పట్టి చూపుతుంది . సిద్ధాంతాన్నీ , శిల్ప విన్యాసాన్నీ సమానంగా మేళవించిన ఒక కొత్త టెక్నీక్ ఆ కవిత లో ఉంది . స్త్రీ కి తన శరీరం పైన అధికారముండాలని , పునరుత్పత్తి పైన స్వేచ్ఛ వుండాలని స్త్రీ సిద్ధాంతం . అప్పుడే మాతృత్వమొక వరం లాగా ఉంటుందన్నది స్త్రీ వాదుల భావన . అబార్షన్ స్టేట్మెంటు కవిత లో అనవసర , అయిష్టమైన గర్భ విచ్ఛిత్తి కొరకు అబార్షన్ చేసుకున్న యువతి

“కంసుడి కత్తి లాంటి ప్లాస్టిక్ బకెట్ మింగిన 
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముద్ద లాంటి నిన్ను చూసి 
మళ్ళీ నా పొత్తిళ్ళలో పొదువుకోవాలని 
మనసు గాయం అయి . కడివెడు కన్నీళ్ల దుఃఖం గా వుంది రా 
అయ్యో పాలింకి పోవడానికి ఉన్నట్టు 
మనసింకిి పోవడానికి మాత్రలుంటే ఎంత బావుండును “

అని ముగిస్తుంది . నిజానికి ఈ ముగింపు కేవలం కవిత్వ ముగింపు మాత్రమే కాదు . అబార్షన్ స్టేట్మెంటు ను రాడికల్ ఫెమినిజ భావజాలం తో మొదలు పెట్టినా మాతృత్వపు మమకారం మాత్రమే స్త్రీ కి ఉపశమనం ఇవ్వగలదన్న సాంప్రదాయ భావజాల అనుకంప ను కూడా కలగలుపుతుంది . అందువలన స్త్రీవాదం ఇక్కడ తన సున్నిత పార్శ్వాన్ని ఎక్కడా కోల్పోలేదని , అది కేవలం పురుష ద్వేషం ఆధారంగా నిర్మించబడిన ఒక ధోరణి కాదని , అది ఒక జీవన సిద్ధాంతం అనే క్లారిటీని తన కవిత్వం ద్వారా సమాజానికి అందించింది . ఇది కేవలం ఆమె కవిత్వం లో ఉన్న గాఢతను వివరించడానికి చెప్పిన ఉదాహరణ మాత్రమే

భార్యా భర్తల సంబంధాలలో వుండే అసమ సంబంధాలని గురించి రజని చెప్పినంత తేలికగా , పదునుగా మరొకరు చెప్పలేదేమో . ఆమె రాసిన “ఒంటి పొద్దు ఆకాశం “ఇందుకు మంచి ఉదాహరణ .

“దాంపత్యమంటే కేవలం 
కేవలం రెండు స్తనాలేనని నువ్వు చెప్పిందాకా 
నీ తరఫున కూడా నేనే నమ్ముతున్నాను అని 
తెలుసుకోలేనంత వెర్రిగా నమ్మాను 
ఇన్నాళ్లు నేను గుండెల మీద మోసింది 
కొన్ని సంపుటులని కాక 
నీ దేహపు కండని వెచ్చజేసుకునే రెండు కుంపట్లనని 
నీ రక్తాన్ని పాదరసం లా పరుగెత్తించే 
రెండు మెర్క్యురీ దీపం బుడ్లనని 
పరిపూర్ణ భోజనానికి ముందు 
విస్తట్లోవడ్డించిన రెండు తీపి లడ్డులనని “

అని అనడం లో స్త్రీ ని ఒక సెక్స్ టాయ్ గా భావించే పురుష అమానుష స్వభావం పట్ల ఎంత పదునైన నిరసన ఉందొ చెప్పలేము . రజని వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు . నిత్యం పిల్లల తో సంభాషిస్తూ , వాళ్ళ తల్లి తండ్రులతో ఇంటరాక్ట్ అవుతూ సమాజాన్ని తనదైన చూపుతో విశ్లేషించుకునే అవకాశం ఆమెకు తన వుద్యోగం ఇచ్చింది . దానితో ఆమె తన మనోవరణం లోకి వచ్చిన ఏ చిన్న అంశాన్నీ కూడా కవిత్వం చేయకుండా వదిలి పెట్టలేదు . అన్నం తినకుండా స్కూల్ కి వచ్చ్హి శోష వచ్చి పడిపోయిన పాప వెనుక కొండలా పేరుకుపోయిన పేదరికం నుండి అంతర్జాతీయ లింగ వివక్ష దాకా ఆమె స్పృశించని స్త్రీ సంబందమైన అంశం లేదు .

బాసిల్లస్ తురాంజెనిసిస్ అనే బి టి పట్టి విత్తనం వాడి ప్రాణాలు కోల్పోయిన రైతు విషాద గాధను కూడా ఆమె ఈ సాంకేతిక పదజాలాలు వాడకుండా అందరికీ అర్ధమయ్యే తెలుగు పలుకుబడులు తోనే వివరిస్తుంది . రజని కవిత్వం లో ఉన్న గొప్పదనం అదే . ఆమె అక్షరాలు మట్టి వాసన వేస్తూ ఉంటాయి ఈ ఉదాహరణ చూడండి

“కోళ్ల కోసం నక్కిన బావల్లా 
వంగ తోట లోకి దూరే దొంగ బావలొస్తున్నారు 
గుత్తి వంకాయలో మృత్యు మసాలా కూరేందుకు 
విదేశీ విషప్పురుగులు వువ్విళ్ల్లూరు తున్నాయట 
అట్లకాడ కాల్చవే అక్కయ్యా ” !

చెప్పిదేమో అంతర్జాతీయ విత్తన సంస్థల ధాష్టీకం గురించి . భాషేమో ఆ దాష్టీకానికి అవుతున్న బాధితుల భాష . ఏ విషయాన్ని ఎవరికీ ఎలా చేరవేయాలో ఆమె కు బాగా తెలుసు . తన సమకాలీన కవుల లాగా ఆమె భాషాపటాటోపం పోకుండా జీవ అక్షరాలని తన కవిత్వం లో పొదుగుతుంది అట్లా కాడ తీయవే అక్కయ్యా అనడం లో పోరాటం గడ్డి వేళ్ళ స్థాయి నుండి మొదలవ్వాలనే స్ప్రుహ ఎంత గొప్పగా ఉందో

ఏ వస్తువును తీసుకున్నా అందం గా , హృద్యం గా చెప్పడం ఆమె పద్ధతి . వస్తువు కోసం శిల్పం కానీ , శిల్పం కోసం వస్తువును కానీ ఎక్కువ తక్కువ చేయదు . రెండింటీ సమన్వయం ఆమె కవిత్వం లో కనిపిస్తుంది .స్త్రీ వాదులు Below The Belt ఎందుకు రాయాలి అని విమర్శించిన వాళ్ళు సైతం ఆమె కవిత్వం లో లేవనెత్తిన అంశాలను గుర్తించకుండా విస్మరించలేరు .

ఇంత మంది స్త్రీ వాదులు కవిత్వం రాసినా రజని బలంగా గుర్తుండటానికి ఒక ప్రత్యేకమైన కారణం వుంది .అది ఆమె భాష . ఆమె ఏ కవిత రాసినా పదునైన , పల్లెటూరి భాష లో రాస్తుంది . అలంకారాల నగిషీలు లేకుండా నిసర్గ సుందరం గా , స్వచ్ఛ శుభ్రంగా రాస్తుంది . అప్పుడే పుట్టిన పసిపాప లేత పాదాలంతా సున్నితంగా ఆమె అక్షరాలుంటాయి . పల్లెటూరు లోని పచ్చచ్చటి వరి పొలాల మీద నుండి వచ్చే పైరగాలి లాగా ఆమె అక్షరం , ఆహ్లాదాన్ని ఇస్తూ మోహ పెడుతుంది .

దేని గురించి రాసినా ఆమెదైన ముద్ర ఉంటుంది . ఆఖరికి అబ్బాయి సినిమా కి వెళ్లి వచ్చినా , తన మోకాళ్ళు నొప్పి పెట్టినా కవిత్వికరిస్తే దాంట్లోనూ నూతనత్వం , కొత్త , కొంగ్రొత్త బంగారు లోకం కనిపిస్తుంది . ఈ కవిత చూడండి

నూనూగు మీసాల వాడు 
నూరు పైసలైనా సంపాదించని వాడు 
గుడ్డ తోరణాలకీ
గులాబీల దండలకీ వందలకొద్దీ వెచ్చించి 
మా అబ్బాయి సినిమా కెళ్ళాడు

అని కవిత ను మొదలు పెట్టి ఎలా చీల్చి చెండాడిందో

తరతరాలుగా పాతుకున్న 
కుల పితామహ , కుల రత్న , కుల పౌత్రులకు 
జేజేలు కొట్టేందుకు , నా తరాలుగా పాదుకున్న 
బావల , తమ్ముల ,మరుదుల అల్లుళ్లకు హారతులద్దెందుకు 
మా అబ్బాయి సినిమాకు వెళ్ళాడు

ఈ మానసిక మరుగుజ్జుతనం 
కొత్త అర్హత ఇక్కడ 
కులశాలలుగా లుకలుక లాడుతున్న కళాశాలలో 
C బ్యాచ్ , R బ్యాచ్,K బ్యాచ్ ,B బ్యాచ్ లుగా విస్తరిస్తున్న 
ఆధునిక అంటరానితనాలమధ్య 
తాత ,ముత్తాతల పేర్లు గుర్తుందని వాళ్లంతా 
పురాతన రాజా వంశాల బూజు కిరీటాలు 
కుల కూటములుగా పేరుగా పెట్టుకుని మురుసుకుంటూ

ఓటు పడవల గాలికి తెర -చాపను వాడుకునే లౌక్యంతో 
నటకుల తిలకులే జెండాపై కపిరాజుగా ఎగరేసే 
ప్రజాప్రతినిదుల ఆదర్శంగా 
మా అబ్బాయి సినిమాకెళ్ళాడు

హింసా రస పర్వం లో మనసు గిజగిజ లాడినా 
భలే “కమ్మ-కమ్మ “గా ఉందని లొట్టలేసేందుకు 
మా బాలకృష్ణుడు సినిమాకెళ్ళాడు

ఒక్క పండూ లేక ఈటుబోయిన తోట 
ఫలవంతమైన వందోరోజని భ్రమించేలా “కాపు “కాసేందుకు 
మా చిరంజీవి సినిమాకెళ్ళాడు

అంతేనా ఇంకా చాలావుంది చదవండి 
ఫలానా వాడిలా వున్నావంటే పండుగ చేసుకుంటాడు వాడు 
సాఫ్ట్ వేర్ తల్లివేరుగా జగమంతా మన జనమే అయిన వేళ 
విశ్వనరుడిగా విస్తరించాలిరా నీ వివేకమని హెచ్చరిస్తే

అటజనిన మన వాళ్ళ తానా బజానాల ప్రత్యక్ష ప్రసారాల్లో 
కులగమ పదనిసలు చూసి -కొంటెగా నవ్వుతాడు

అరెరే 
డప్పులు , చిందులు , గరాగాలు, కొలతలు ,గురికొయ్యలు 
కాటిపాపలు, బహురూపులు , తోలుబొమ్మలు , యక్షగానాలు 
జీవగలగలకల లెన్నింటినో కాలరాచి 
తొంభయితొమ్మిది మంది అన్నల ఒక్కొక్క మెతుకూ తిని బ్రతికిన శకుని మామలా మిగిలింది కదా -ఈ చిత్ర సీమ

దురభిమానం దురంధరులుగా యువతను రెచ్చగొట్టి 
కులకురుక్షేత్రాలకు కానుందా చిరునామా 
అందుకే ఒక కళా అంధుడిగా మారుతున్న నా బిడ్డకు

ఒక శ్రీశ్రీ పద్యాన్నో 
ఒక సినారె గజల్ నో 
ఒక గోరటి పాటనో 
మువ్వల చేతికఱ్ఱగా తీసుకుని వెళ్ళాలి నేను ఇవాళ

వెళతాను మరి -వాడొచ్చే వేళయింది 
తలుగపు తీయాలంటే భయం

కంటిచూపుతో చంపేస్తాడో 
పీక కోస్తానంటాడో

అమ్మతోడు ! అడ్డంగా నరుకుతాడో 
మా అబ్బాయసలే సినిమాకెళ్ళాడు

అన్ని కళలను కాల రాచిన శకుని మామ కదా ఈ చిత్రసీమ అనడం లో రజని ఆవేదన ప్రతి ఒక్కరి అనుభవం లో ఉన్నదే .

తన అనుభవం లోకి రాణి దేన్నీ ఆమె కవిత్వం చేయలేదు . సహానుభూతి కూడా ఆమె స్వానుభవం లోకి వచ్చిన తరువాతే రాసింది . ఆమె కవిత్వమెప్పుడు చదువుకున్నా మట్టి పొరల కింద విత్తనం పడే భాధ ఎదో వినిపిస్తుంది . అది సన్నగా గుండెలని కోస్తుంది ఆమె రాసిన “దేహ శిశిరం ” చదివితే గుండె ను సన్నగా ఎవరో కోస్తున్నట్టు ఒక బాధ నిండా మిమ్మల్ని ముంచెత్తకా మానదు . స్త్రీల లో రుతుక్రమం ఆగిపోయిన దశను ఆమె దేహ శిశిరం తో పోల్చింది . ఆ సమయం లో వుండే చిరాకును , చికాకును , అసహనాన్ని , క్రోధాన్ని , అన్నిటినీ అద్భుతంగా కవిత్వమయం చేసింది .

“మోహ తిమిరం కమ్మిన ఈ దేహ శిశిరం సాక్షిగా 
నా కిప్పుడు ముట్లుడిగిన పండుగ చేసుకోవాలి అనిపిస్తోంది 
పడచువాళ్లను చూస్తే పళ్ళు కొరకాలనీ 
మిసమిసల మెనూ మీద మెటికలు విరవాలనీ 
విరబూసే నవ్వులని విరగబాటని ఈసడించాలని 
బుసబుస పొంగే నా అసహనానికి విరుగుడుగా 
నా ఈడు వాళ్లకి అనుభవ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి 
బోలు బారే ఎముకలనే కాదు 
బేల చేసే ఉద్వేగాలనీ గట్టిపరచుకోవాలి 
పనికొస్తుందన్నపుడు పండుగ చేసుకుని 
పదును తగ్గాక పాత పనిముట్టుగా చూసే 
ఉత్పత్తి సామ్యపు నీడల్ని తోలేసి 
కొత్త దీపాలెన్నైనా సరి తూగలేని 
అద్భుత దీపం లా ఆత్మ దీప్తిని నింపుకోవాలి “

ఋతుక్రమం ప్రారంభం కావడాన్ని వసంతం తోనూ , ఆగిపోవడాన్ని శిశిరం తోనూ పోల్చి స్త్రీ ప్రకృతికి పర్యాయ పదం ఎందుకు అయిందో రజని చెప్పిన క్రమం హృదయాన్ని కదిలిస్తుంది . అనుభవ తాంబూలాలు ఇచ్చుకోవాలి అనే వాక్యం ఎంత బావుందో

ఎర్ర జాబిల్లి ఎరీనా ఆమె కవిత్వ సంపుటి . జేబు ఆమె కధల సంపుటి . ఇవే కాక ఆమె వార్త దినపత్రికలో మామగారి కధలు పేరు తో మరి కొన్ని కధలు కూడా రాశారు . మంచి కవిత్వం రాసే రజని కాంత కాలం గా కలం పట్టక పోవడం ఒక విషాదం . మంచి కవిత్వం రాసే వాళ్ళు కవిత్వం రాయడం మానివేస్తే అకవిత్వం కవిత్వం పేరుతొ ప్రాభవం పెంచుకుంటుంది . రజని మళ్ళీ విరివిగా కవిత్వం రాస్తే బావుండును

వంశీకృష్ణ 
9573427422

No Comments

Post A Comment

You don't have permission to register