‎Vamsy Krishna‎

vamsy

‎Vamsy Krishna‎

కవిత్వ ప్రపంచం 37

గాలి ముద్దు పెడితే పూలు సిగ్గు పడ్డాయట

కవిత్వ ప్రపంచం లో ఒకింత మార్పు కోసం అప్పుడప్పుడు మంచి తెలుగు సినిమా పాటల గురించి కూడా తడుముదాము అనుకుని మనసు కాస్త కలతపడితే అనే పాట గురించి రాస్తే మంచి ప్రతిస్పందన వచ్చింది . ఇవ్వాళ ఎందుకో మనసు మళ్ళీ ఒక పాట వైపు మళ్లింది . మీకూ నచ్చుతుంది అనుకుంటాను

భావుకుడైన కవికి వర్ణించడానికి వెన్నెలను మించిన వస్తువు లేదు . ఎవరు ఎన్నిరకాలుగా వర్ణించినా చెప్పడానికి ఇంకా ఎదో మిగిలిపోయే వస్తువు ఏదయినా ఉందా అంటే అది వెన్నెల మాత్రమే . ఒక రకంగా ఇది భావుకులకు పుష్పక విమానం లేదా అక్షయ పాత్ర . 
శాస్త్రకారులు వెన్నెలను చూసే , నిర్వచించే దృష్టి వేరు . కవులు గాయకులు వెన్నెలను వీక్షించే కలవరించే దృష్టి వేరు . శరత్కాలపు వెన్నెల గురించి కవి కాళిదాసు చెప్పిన ఉపమానాలు గురించి ముచ్చటించాలి అంటే దాని అదే ఒక పెద్ద కావ్యం అవుతుంది

వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల అని ఆధునిక శ్రీశ్రీ సంబరపడి పోతే పుచ్ఛా పువ్వుల వెచ్చా వెన్నెల విచ్చీనాయమ్మా కలువలు విచ్చీనాయమ్మా అని వేటూరి మనోహరంగా మనోహరం లో వెన్నెల లోని వెచ్చదనం గురించి చెప్పడానికి వెచ్చా వెన్నెల అనే పద ప్రయోగం చేశాడు . మంటలు రేపే నేలరాజా ఈ తుంటరి తనము నీకెలా అని కవి దాశరధి వెన్నెలను నిష్ఠురమాడాడు

వెన్నెల ఎప్పటికీ వన్నె తరగని కావ్య వస్తువు . భోజ మహారాజును చూడగానే పామరుడికి సైతం కవిత్వం పొంగుకుని వస్తుంది అంటారు . అందులో నిజం ఎంతో తెలియదు కానీ పండు వెన్నెల లో నిండా తడుస్తూ “ఓహ్ ఈ వెన్నెల ‘ అంటూ ప్రశంశా పూర్వకంగా ఒక్క మాటైనా అనుకోని హృదయం ఉంటే అది హృదయమే కాదు అనుకుందాము 
ఏటి గట్టు , నీటి పాట , వెన్నెల మాట ఇవి ఎప్పటికీ రసన్ఫ్యూర్తిని కలిగించే అంశాలే . చల్లని తెల్లని వెన్నెల , మంద్ర మంద్రంగా మనోహరంగా వీస్తున్న మలయానిలం , , ఎదురుగా మనసు దోచుకున్న నెచ్చెలి , హృదయం లోపలి నుండి వెల్లువెత్తుతున్న కల్యాణీ రాగ కువకువలు , ఏ భావుకుడినైనా తట్టి లేపడానికి ఇంతకంటే అద్భుతమైన సన్నివేశం ఏమి ఉంటుంది ?

ఎప్పుడో 1955 లో వచ్చిన సంతానం సినిమా కోసం ఇలాంటి సన్నివేశాన్ని సృస్తిస్తే , యాంగ్రీ యుంగ్ టర్క్ గా పేరుపడిన అనిసెట్టి పినిశెట్టి ద్వయం లోని అనిసెట్టి సుబ్బా రావు , ఎంతో సాఫ్ట్ గా అజరామరమైన ఒక పాటను రాశారు . సుసర్ల దక్షిణామూర్తి మాస్టారు స్వరాలను అందిస్తే ఘంటసాల మాస్టారు హృదయోద్విగ్నంగా గానం చేశారు 
పాత పల్లవికి ముందు శ్రోతను సంసిద్ధం చేస్తూ కల్యాణీ రాగం లో మాస్టారు ఆలపించిన ఆలాపన హృదయాన్ని సన్నగా కొస్తుంది . విశ్వమంతా ప్రాణ విభుడి ఇల్లై ఉండ అని కృష్ణశాస్త్రి అన్నట్లుగా ఈ విశ్వమంతా రాగమయం కాగా ఆ రాగాలాపనలో మనలని మనం మరచిపోతాము . మనముందున్న సమస్త ప్రకృతీ మాయమై పోయి ఆ సమ్మోహన రాగం లో మనమూ ఒక స్వరం అవుతాము . ఆ ఆలాపనలో మన భౌతిక మానసిక ప్రపంచాలు శుభ్రపడి నిర్మల స్ఫటికంలా మెరుస్తాయి .

చల్లని వెన్నెలలో 
చక్కని కన్నె సమీపములో 
అందము నాలో లీనమాయెనే 
ఆనందమే నా గానమాయెనే

మనిషి ప్రణయ జీవితంలో వెన్నెల పోషించే పాత్ర తక్కువేమీ కాదు . ఆనందమూ , ఆరాధనా ఈ రెండూ సంగీతంలో రెండు స్థాయీ బేధాలలలాటివి . ఆనందం మంద్ర స్థాయి అయితే , ఆరాధన తారాస్థాయి . ప్రాకృతిక సౌందర్యానికి స్పందించిన హృదయం మంద్ర స్థాయిలో ఆనందాన్ని పొందుతుంది , ఆధునిక భాషలో చెప్పాలి అంటే ఎంజాయ్ చేస్తుంది . ఆ ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది నెచ్చెలి సాన్నిహిత్యం . ప్రాకృతిక సౌందర్యమూ , నెచ్చెలి సాన్నిహిత్యమూ రెండూ పరస్పర ఆశ్రితాలయి ఒకే సారి లభిస్తే ఆనందం తారాస్థాయిని తాకి హృదయం లోపల నందన వనమై పరిమళిస్తుంది . అందం లీనమై మళ్ళీ ఆనందమై గానంగా ప్రకృతిలోకి ప్రవహిస్తుంది .

భూమి మీద నీరు ఆవిరై , మేఘమై మళ్ళీ వర్షం లా భూమి ని ముద్దాడే జలచక్రంలా ఇది కూడా ఒక సౌందర్య చక్రం . ప్రాకృతిక సౌందర్యం మళ్ళీ ప్రకృతిలోకే ప్రవహించడం అన్నమాట . మనిషి కూడా ఒక భాగమే కదా ప్రకృతిలో

తెలి మబ్బుల కౌగిలి లో 
జాబిలీ తేలి యాడెనే ముద్దులలో 
గాలి పెదవులు మెల్లగా సోకిన 
పూలు నవ్వేనే నిద్దురలో

ఏ జన్మ సంస్కారమో లేకపోతే కవికి ఇంత భావనాబలం ఎలా వస్తుంది ? సుమం రాలితే సౌరభం గాయపడుతుంది అనుకునేంత సున్నితత్వం లేకపోతే ఈ పద చిత్రం వస్తుందా ? తెలి మబ్బుల కౌగిలి లో జాబిలి తెలియాడిందట .పువ్వులను గాలి ముద్దాడితే వాటికి సన్నగా నవ్వొచ్చిందట . 
స్త్రీ సౌందర్యాన్ని చూడాలి అంటే ఆమె నిద్రిస్తున్నప్పుడు చూడాలి అంటాడు చలం నీలి ముంగురులు నుదుటి మీద పడి , చిరు చెమటకు ఆ ముంగురులు తడిసి బలంగా ఉఛ్హ్వాశ నిశ్వాశలు వదులుతూ ఆమె పక్కకు తిరిగినప్పుడు సౌందర్య సాక్షాత్కారం జరిగింది అన్నాడొక భావుకుడు . వెదురు పూల పొదరింట్లో వేణువేదో విశ్రాంతి తీసుకున్నట్టు అని ఈ వ్యాస రచయత కూడా ఒక కవిత లో రాశాడు . 
నిద్ర గురించి ఇంత చెప్పడం ఎందుకు అంటే నిద్రలో మనం మనం గా ఉండం .మన భౌతిక ప్రపంచపు లౌల్యాలు అన్నిటినీ వదిలివేసి అప్పుడే పుట్టిన పసి పాపంత శుభ్ర కౌముదీ తరంగాలంత స్వచంగా ఉంటాము కనుక 
అలా వెన్నెల దుప్పటి కప్పుకుని పువ్వులు నిదుర పోతున్నప్పుడు గాలి మెల్లమెల్లగా వచ్చి . ఆ దుప్పటి తొలగించి పువ్వుల పెదవులపైన సున్నితంగా , సుతారంగా ముద్దు పెట్టుకున్నదట . ప్రియురాలి నిద్రా ముద్రిత సౌందర్యానికి చూసి మొహం ఆపుకోలేని ప్రియుడు ముద్దాడినట్టుగా గాలి పువ్వవులను ముద్దు పెట్టుకున్నదట . పువ్వుల పెదవుల మీద గాలి పెదవులు తాకగానే , నిద్రిస్తున్న పువ్వులకి మెలకువ వచ్చి ఉంటుంది . ” నీ దొంగాట నాకు తెలుసులే ” అని సన్నగా సిగ్గుపడి నవ్వుకుని ఉంటాయి

ఈ దృశ్యాన్ని మనసు ముంగిట్లో ఊహించుకుంటేనే మనసు ఆనంద తరంగిత మౌతున్నది కదా .

” కళ కళ లాడే కన్నె వదనమే 
కనిపించును ఆ తారలలో 
కలకాలం నీ కమ్మని రూపం 
కలవరింతు నా మది లో “

ఈ తానూ చూసినా ప్రియురాలి రూపమే కనిపించిందట . ప్రేమలో వున్నప్పుడు అంతే . ప్రతి వస్తువులోనూ మనం ప్రియురాలినే వెతుక్కుంటాము . ప్రతి అనుభూతికీ ఆమె రూపాన్నే ఇస్తాము . ప్రతి ఆలోచనలోనూ ఆమెకు చోటు ఇస్తాము . ప్రతి కదలికా ఆమె కోసమే అనుకుంటాము .అలాంటప్పుడు ప్రతి తారకలోనూ ఆమె రూపమే కనిపిస్తే ఆశ్చర్యమేమున్నది ?

మగవాడి మొరటు శిలా విగ్రహానికి వన్నె తెచ్చే పాలవెల్లి స్త్రీ . . ఆమె తన జీవితం లో ప్రవేశించేటంత వరకు పురుషుడు అర్ధానుస్వారం . ఆమె ప్రవేశించిన తరువాత అతడు పూర్ణానుస్వారం అవుతాడు . అందుకేనేమో కవి కలకాలం నీ కమ్మని రూపం కలవరింతును నా మదిలో అంటున్నాడు .

అనిసెట్టి భావనాబలం , సుసర్ల సంగీత ప్రాణం , ఘంటసాల గాన మాధుర్యం కలసి ఈ పాటను తెర స్మరణీయం , చిరస్మరణీయం చేశాయి . సంతానం సినిమా తెలుగు ప్రేక్షకులకు మరొకందుకు కూడా గుర్తు ఉంటుంది . లతా మంగేష్కర్ తన తొలి తెలుగు పాట నిదుర పోరా తమ్ముడా ఈ సినిమా కోసమే పాడింది . దేవీ శ్రీ దేవి కూడా ఈ సినిమా లో దే

హృదయ తంత్రులను మీటడమూ సాహిత్య ప్రయోజనమే కదా . మనసు బాగోలేనప్పుడు ఈ పాట వినండి . మీకు సాంత్వన కి నాదీ పూచీ

వంశీకృష్ణ 
9573427422

No Comments

Post A Comment

You don't have permission to register