‎Sreeram Puppala‎

_Sreeram Puppala_

‎Sreeram Puppala‎

కవితా ఓ కవితా – శ్రీరామ్ – 1

గడచిన ఏడెనిమిది దశాబ్దాల్లో ఆధునిక వచన కవిత్వాన్ని ఎందరో కవులు సుసంపన్నం చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పంధా. భాషలోనైతేనేమి, భావ ప్రకటన లో నైతేనేమి వాళ్ళదంటూ ఒక ప్రత్యేకత ని సాధించబట్టి ఆయా కవిత్వ పంక్తులు, ఆ పుస్తకాలూ అంతటి గమనింపుకు నోచుకున్నాయి. ఈ విశేష లక్షణాలు వాళ్ళ వాళ్ళ తొల్తొలి సంపుటాల్లోనైతే మరింత స్పష్టంగా ఉంటాయి. తొలిచూలు భావోద్వేగాన్ని చెప్పటానికి ఏ తల్లికైనా ఎన్ని మాటలు సరిపోతాయి చెప్పండి ? ఆ అవ్యక్తాల వెతుకులాటలోకే మన ఈ ప్రయాణం. Hug me to your heart and say Good Luck Sreeram.

ఉదయోత్సవ సంరంభమో….
సాయం సంతాప శోకమో…

అసలు కొంత మంది కవులు అంత ఫేమస్ ఎలా అయిపోతారో తెలీనే తెలీదు. మాణిక్యం అవార్డూ, అరుణ్సాగర్ అవార్డూ, ప్రజ్జ్వలిత పురస్కారం ఇంకా వగైరా వగైరాలు కూడా వరిస్తాయి. భూతద్దం వేసుకుని వెతికినా పట్టుమని పిడికెడంటే పిడికెడు కవితలే రాస్తారు. వాటన్నింటి పేర్లూ గుర్తుండే ఛాన్సే లేదు. కేవలం “పుట్టుమచ్చొ” క్కటే సమస్త కీర్తి కాయాన్నీ మోసుకుతిరుగుతుంది. నేనేంత దుగ్ధ పడ్డా తీరిపోయేది కాదు. ఖాదర్ గారంతటి మంచి కవి. అంతే.

1955 లో పుట్టిన కవి, 1991 లో తీసుకొచ్చిన కవిత్వ సంపుటిది. నేటికీ తొలిదీ, చివరిదీనూ. ఎందుకంటే ఆయన ఇంకొక పుస్తకం తెస్తాడో లేదో “ఖుదాహ్ జానె”, రేపటి సంగతి నేనెత్తను. కానీ ఈ ఒకేఒక్క పుస్తకం ఆయన సాహిత్య జీవితమ్మొత్తాన్నీ వెలిగించేసింది. కారణం ? ముస్లిం వాదానికి ఈ కవితా సంపుటి ‘ఐడెంటిటీ’ ఇచ్చినందుకా ? ఏమో ఈ పుస్తకంలో పుట్టుమచ్చన్న కవితొక్కటీ ఒక వైపూ, మిగతా వన్నీ మరొక వైపూ నిలబడ్డట్టు కనిపిస్తాయి. వస్తుసాంద్రత వల్ల ఆ భేదం కనిపిస్తుంది.

ఒక కట్టుకథ…
ఒక వక్రీకరణ…
ఒక అపనింద…
అవును, పుట్టుమచ్చ అతని ఉనికి…
పుట్టుమచ్చ అతని అస్తిత్వం…
పుట్టుమచ్చ అతని పౌరసత్వం…
అతను వూపిరి పీలుస్తూ మసలుతూన్న నేలా గాలీ పరిసరాలూ అతనికి దఖలు పరిచిన వారసత్వం యీ పుట్టుమచ్చ…
ఎప్పటికీ మానని గాయం యీ పుట్టుమచ్చ…
ఇది ఖాదర్ మొహియుద్దీన్ తెలుగు మస్తిష్కాల ముంగిట పరచిన పుట్టుమచ్చ…

మనమెన్ని సార్లు విన్నా పాతబడని వాక్యాలవి.”నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైవుంది నా పేరు– నా ఇంట కన్ను తెరిచిన నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో 1947 ని దర్శిస్తుంది వర్తమానం” అంటాడు. జీవితం యొక్క చైతన్యాన్ని కవిత్వ కళ చేసుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది. అప్పటికి ముస్లిం అంటే ఇతనేనా అని తడుంకుని చూసేంత స్పష్టం గా సమాజంలోని అసమానతని సమర్ధవంతంగా చిత్రించిన పద్యం అది. సహజాతంగానైనా, తర్కబద్దంగానైనా ఎంత అనుభవించి ఉంటాడీ కవి. బుద్ది కన్నా దగ్ధమైన హృదయం కనిపిస్తుందీ కవిత లో. “నా కాళ్ళ కింద నేలని తొలిచేయాలనుకోవడం కుట్ర గాదు. పుట్టి పెరిగిన దేశంలోనే నన్నొక కాందిశీకుణ్ణి చేయడం కుట్ర కాదు, కేవలం నా మత విశ్వాసాలు కుట్ర, నా సామూహిక ప్రార్ధనా సమావేశాలు కుట్ర, నేను బతికి బట్ట కట్టాలనుకోవడం కుట్ర, నా అజ్ఞానం కుట్ర, నా వెనుకబాటుతనం కుట్ర, నేను పెళ్ళాడటం కుట్ర, పిల్లల్ని కనడం కుట్ర” అని తన దుక్ఖ పరిచయం చేస్తాడు.

దేశవిభజనానంతరం ముస్లింలంటే ఎంత ద్వేషభావం పెరిగిపోయిందీ , వాళ్ళకి మిగిలింది “పాకిస్తాన్ లేదా ఖబరస్తాన్” అని వాపోతాడు కవి. అప్పటిదాకా ఉన్న ముస్లిం కవులెవరూ ఇలా చెప్పలేదు. ఇదేదో “పార్లమెంటు భవనంలోకి వాలేందుకు నా నెత్తురు పాదలేపనమవుతంది–నగరాల నడివీధుల్లో నా నెత్తురు తీర్ధ స్నాన ఘట్టమవుతుందంటూ” పదునైన బాణాల్ని గుండెల్లోకి దించుతాడు కవి. విలవిల్లడిపోతాం. ఈలాంటి వాక్యాలు చదివినపుడు ఏ అలంకారాలు వెతకబుద్దేస్తుంది ? ఇది కాన్ క్రీట్, ఇక్కడ అధిక్షేపం బాగుందీ అనగలమా ? ముస్లిం సామాజిక, రాజకీయ, ఆర్ధిక జీవన స్తితి గతుల మీద సాధికారంగా, నిక్కచ్చిగా భావావేశపడే ఈ కవితా పంక్తుల్లో కొంత మేర అనుద్విగ్నత కూడా దాగిఉంది. అక్కడ అన్యాపదేశాలేవీ ఉండవు. ప్రయోజనవంతమైన వస్తువులు దొరికినపుడు కవికి ఎదుటివారిని మెప్పించడం ఎంత సులువైన పనో ఇట్టే తెల్సిపోతుంది. అందుకా రచన సందేశభూయిష్టంగా ఉండాల్సిన పనీ లేదు. ఖాదర్ “పుట్టుమచ్చ” అందుకే అంత ఫేమస్ కవితైపోయింది.

దాగే పైదాయిష్ లో అల్ప సంఖ్యాక దూకుడు లేకపోవడం ఖాదర్ కవితా సంస్కారానికి నిదర్శనం. మైనారిటీ యారోగెన్స్ రెండు సందర్భాలలోబయట పడుతుంది. ఒకటి నువ్వు తప్పయి నువు ఎవర్నీ ఎదుర్కోలేక పోతున్నపుడూ… రెండు నువు ఒప్పయి ఎవరూ నిన్ను ఎదుర్కోలేకపోతున్నపుడూ… ఖాదర్ రెండో రకం. దూకుడు, యారోగెన్స్ పదాలు పక్కన పెడితే అరుణ్సాగర్ అవార్డిస్తున్న టైంలో ఈ ప్రసేన్ గారి అబ్జర్వేషన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

రామచంద్ర గుహ గారి “ఇండియా ఆఫ్టర్ గాంధి” లో ఉటంకించబడింది, వేల్చేరు గారి “హైబిస్కస్ ఆన్ ది లేక్” పుస్తకంలో అనువదించబడింది. ఈ వాక్యాల్లో అర్ధం వెతుక్కునేందుకు క్లిష్టతేమన్నా అనిపిస్తుందా ? లేనే లేదు కదా? అయితే పుస్తకమ్మొత్తం ఇలా ఉండదు.

“వేళ్ళ కాళ్ళని నగ్నం గా బారజాపి, ఏటినీటిలో నీడల్ని శీర్షాసనం వేయించి తపస్సు చేస్తూన్న చెట్లు, పసిపిల్లాడిలా చేతులాడిస్తూన్న బెల్బాటం తాడిచెట్టు. ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు. దాని తోక నేల మీద ఎలిజీ రాస్తోంది” (సంధ్య) అని కూడా ఉంటుంది.

“రాత్రి రాసుకున్న చీకటి గోరింటాకు ఎర్రందనపు ఆనందం. ఉదయించడంలో ఉద్వేగం చచ్చిపోతే సూర్యుడు కేవలం ఒక రంగు డబ్బా”(అంతే) అనీ అంటాడు. ఇలాంటి అన్వయాల వల్లే చదువరి అనుభవం, కవి ప్రతిభ ముందు రంగుల రాట్నం ఎక్కేస్తుంది.

“ఇసకేస్తే రాలనన్ని ఆలోచనలు; మెదడు మైదానంలో కుస్తీపోటీ. ఎప్పుడో పాడుకున్న ఒక స్వేచ్చా గీతం, కాళ్ళను బంధించిన ఒక సంకెళ్ళ మోతా; ఆహ్లాదకరమైన వెన్నెట్లో ఒక చీకటి రాత్రీ, ఒక బాధాపాదరసానుభూతీ గుర్తొచ్చి, కల్లోలిత సముద్రం శిరస్సులో సుళ్ళు తిరుగుతుంది” (తట్టినట్లు) అన్నపుడు కళ్ళ ముందేం కనిపిస్తుంది? నాకైతే అన్నీ సాంప్రదాయేతర రసజ్ఞతతో కూడిన ఇమేజరీలే (భావ చిత్రాలు) జిగేల్ జిగేల్మని మెరుస్తాయి.

“పుంస్త్రీలింగం” అనే కవితొకటి పరిశీలిస్తే “నీరు న్యూట్రల్ కాదు. అది యెట్లన్నన్, లంకల్లోంచి తొంగిచూస్తే నది, తొడల్ని ఎడంజేస్కుని నగ్నంగా పడుకున్న ఆడదిలా ఉంటుంది” అంటాడు. ఇంకో పంక్తిలో “ఇళ్ళ పంచల్లో, మేడల్లో మిద్దెల్లో శివలింగాలై మొలిచి వెల్లకిలా పడుకున్న బిందెల్ని, దోసిళ్ళ దోనెల్ని అరచేతుల దొప్పల్నీ అభిముఖంగా ఆకర్షించుకుంటుంది. నిజంగా నీరు రెండువైపులా పదునుగల కత్తి. అది ఆడదీ, మాగాడూనూ” అని ముగిస్తాడు. కళ్ళముందేమన్నా బొమ్మ కనిపించిందా ? అనుభూతిని, అది కలిగించిన చర్య ప్రతిచర్యని ఏది నియంత్రిస్తున్నదో పట్టుకోగలమా ? మెడియోక్రిటీ నుండి దూరంగా పారిపోతున్నట్టు కనిపించడం లేదూ ? రెండు విభిన్న జాతుల లక్షణ స్వభావస్వామ్యాల్ని చాలా గొప్ప గా చిత్రిస్తాడు కవి.

భావరస్మి అనే కవితలో ఇంకా ఊపిరాడదు. “వాడిపోయిన తొడిమెలు నా కళ్ళు” అంటాడు. “సముద్రం పుస్తకాల పుటల్ని తిరగేస్తుంది. దాని ఏకాగ్రతకేమైనా అంతరాయమా మనం ? నరాల్తో పెదాల్ని బిగదీసి ఆ షెహనాయీ ఎందుకలా రోదించడం” అంటాడు. ఏదో తెలుస్తుంటుంది గానీ ఏమీ తేలనట్లుంటుంది కదూ ? కళాత్మక హేతువుల్ని, అందులోనూ అనుభూతిప్రధానమైన భావాల్ని వస్తు ప్రపంచలోకి జొప్పించడం చేత మానవీకరణ (పెర్సోనిఫికేషన్) కనిపిస్తుంది. దీవలనే పాఠకుడి మనస్సులో ఆ దృశ్యం తాలూకు ప్రభావం గాఢంగా పడుతుంది.

ఆత్మహత్యాగ్రహం, చెప్పుల్తొడుక్కున్న శవం లాంటివి చదివినపుడు ఖాదర్ సాబ్ కి ఒక (రాజకీయ) ఎజండా ఉందేమో అనిపించేది. అంటే లేదని కాదు సుమా ! ఆ కవితలలా ఉంటాయ్. “నవ్వుకుంటూ నాలిక చప్పరించుకుంటూ నీళ్ళలోంచి నీడల్లోకి వెళ్ళిపోయిన ఖడ్గమృగాన్ని అవి గుర్తుపట్టలేవు. నిండు సూర్యుణ్ణి అవనతం చేసి కళేబరానికి కుంకుమ పూజ జరిపిన ఆకాశానికీ ఇది అర్ధం కాదు. తనువును ధనువును చేసి ప్రాణాన్ని బాణంలా సంధించడం ఆత్మ హత్య కాదు — ఒక ఆగ్రహ ప్రకటన” అని ఆత్మ హత్యనిలా ఆగ్రహంగా ప్రకటించిన కవులెంతమంది చెప్పండి.

అలాగే “పెళ్ళాం శవం పక్కన పడుకుని శవాలని కలగంటున్న శవం. శవాలను కంటున్న శవం: చెప్పుల్తొడుక్కున్న శవం; పట్టెడు మెతుకుల కోసం పక్కలో పడుకుంటున్న శవం” అంటాడు.

కవితల్లో ఎక్కడా లాజిక్ వాడినట్టుండదు గానీ, అంత తొందరగా ఎక్కదు కూడా. ఈ ఎక్కడం అంటే ? అతని పోలికలు, వాక్య నిర్మాణం తో పాఠకుడి విభేదమా ? కాదు. తన కవిత్వ మనహ్ స్తితిని ఆసాంతమూ భావ ప్రకటనలోకి ట్రాన్స్లేట్ చేసే క్రమంలో అంచెలంచలుగా ఒక సౌధాన్ని నిర్మించుకుంటూ పోతాడు. దీన్ని కవి సీతారాం అధివాస్తవిక చ్చాయ గా నిర్ధారిస్తారు. మనం ఒప్పుకోవల్సిందేననిపిస్తుంది. భావాన్ని జయించడం కోసం పాఠకుణ్ణి అంత ఈజీ గా వదిలిపెట్టిన సందర్భమైతే ఉండదు. వాడు యాతన పడాల్సిందే. అప్పుడు గానీ రసావిష్కరణ జరగదు. ఈ లక్షణం మోలోనో, అజంతాలోనో దొరికిపోతుంది. ఇక్కడలా కాదు. వివేచన కి, కాని దానికీ గల వైరుధ్యమే కాదు, సామీప్యమూ అసహజ వస్తు ఆరోపణల్లో కనిపిస్తుంది. అయితే కొన్ని కవితల్లో నాకు ఇస్మాయిల్ గారు కూడా దర్శనమిస్తారు. వస్తువుపట్ల నిర్మాణపరంగా ఖాదర్ గారిదంత ప్రత్యేకంగా కనిపించే రూపమే అసలు ఆస్థిగా ఉంటుంది.

అరుదుగా రాస్తున్నట్టుండే ఈ ముస్లిం అస్తిత్వ వాద కవి (పుట్టుమచ్చ ఆ ముద్ర వేసేసింది) మళ్ళీ కవిత్వ పుస్తకం వేస్తే బాగుంటుంది. ఇదొచ్చి (1991) పాతికేళ్ళపైబడింది. ఇంత గాపా ? మానవుడనే కాగితాల్ని ముందేసుకుని చదువుకుంటూ కూచుండిపోయాడా ఏంటీ కవిమానవుడు. ఎన్నెన్ని సిమిలీలు, మెటఫర్లు ? ఎంత చక్కటి కరుణ దయా రసార్ద్ర సన్నివేశాలు ? ఈ కవి సున్నితమైన హృదయ ఫలకం మీద కవిత్వం గొంగళీ పురుగల్లే మొదలిడి సీతాకోకచిలుకై రివ్వున ఎగురుతుంది. వొంటీండా జలగల్తో ఇంటికొచ్చిన గేదలా నొప్పివడుతుంది. మూలగల్లోని నొప్పిని పీల్చే పుస్తకం. ఇతగాడు TS Eliot రాసిన “ది వేస్ట్ లాండ్” ను చవిటిపర్ర గా అనువదించాడు. “అస్తమించని రవి” అనే జీవిత చరిత్ర రాశాడు. ఇప్పుడు 63 యేళ్ళొచ్చుంటాయ్ గానీ ఇంకో కవిత్వ పుస్తకం వేసేస్తే నేలను చీల్చుకు ఎదిగిన తాటిచెట్టు మీదకి, నరాల రెక్కలు జాడించి, చూపుల తెరచాపలెత్తి, తడిసిన సున్నంలో పొర్లిన నల్ల కుక్కలా నడచివచ్చే వెన్నెలై కురవడం మళ్ళీ అనుభవంలోకి రావడం ఖాయం.

ఈ పుస్తకం మొదట కవిత్వం ప్రచురణలు – త్రిపురనేని శ్రీనివాస్ అచ్చేశాడు. అతనో అద్భుతం. లేటెస్ట్ గా 2016 లో విజయవాడ సాహితీ మిత్రులు పునర్ముద్రణ చేశారు (కాంటాక్ట్ – 94906 34849)

ఇన్నేళ్ళతరువాత కూడా అలసటని ఆసాంతం వార్చేసుకున్న శరీరం స్పృహలోకి తేలి, ఒక అద్వైత స్తితిలోకి తోయబడి ఈ వాక్య సముఛ్ఛయాలన్నీ ఉదయోత్సవ సంరంభమో, సాయం సంతాప శోకమో — అంతు తేల్చుకోమంటాయి. ఎలా తప్పించుకోవడం ?

పల్లవి పగుళ్ళనించి
నాదాల నెరదల్నించి
నెత్తుటి మెత్తదనంలా
ఆవేదనలా,
ఆర్తనాదంలా
నలిగి నలుపెక్కిన ఆత్మారావంలా వినిపించే 
అతని ప్రతీ మాట
పేర్చిన పెదాల చితిమీంచి పచ్చటి మంటలా వెలుగుతూ కనిపిస్తూ వుంటాయి శాశ్వతంగా….

కృష్ణా జిల్లాలోని ఒక చీమలపాడనే మారుమూల కుగ్రామం లో పుట్టి ఇప్పుడు విజయవాడలో ఉంటున్న జనాబ్ ఖాదర్ మొహియుద్దీన్ గార్ని 90009 76999 కి కాల్ చేసి మీ పుట్టు మచ్చ బాగుంది, మళ్ళీ అలాంటి కవిత్వ పుస్తకం కావాలని అడిగితే తప్పేముంది ?మరెందుకాలస్యం ?
***
ఇది నచ్చితే వచ్చే పక్షం మళ్ళీ మరొక తొలివలపు తియ్యందనంతో కలుస్తాను.

మీ 
శ్రీరామ్
9963482597

No Comments

Post A Comment

You don't have permission to register