‎Rajaram Thumucharla‎

_Rajaram Thumucharla_

‎Rajaram Thumucharla‎

చేవ వున్న చిగురు కొమ్మ మాత్రమే కాదు కవిత్వపు నీటి పూలవాన కూడా ఈ అర్చన

~ రాజారామ్.
“ Once made eqal to man, Woman becomes his superior. “ 
సొక్రటీస్

“రాత్రి పూట
మెత్తని దిండ్లు మా అమ్మ చేతులు
వానకి గొడుగైంది మా అమ్మ చేతులే “

మనిషిలో మొలకెత్తే పశుత్వాన్ని మొదట్లోనే తుంచి మానవత్వాన్ని పెంచి ,అమృతత్వాన్ని పోషించే దశవరకు ఆనందం నుంచి ఆవేదనల వరకు వాటి మద్య జీవించే అవిశ్రాంత జీవి అమ్మే. ఆ అమ్మ చేతుల్ని తాను నిద్రపోయేటప్పుడు మెత్తని దిండ్లుగా , వానకి తడియకుండా కాపాడే గొడుగుగా .. పోల్చి కవిత్వ క్షేత్రంలోకి తొలి అడుగు వేసింది “ నీటి పూల వాన ‘ తో.వొక చిన్నారి.

రెండే రెండు అక్షరాలు కవిత్వ క్షేత్రంలో ఒక సమ్మోహన శక్తితో నిలబడగలిగాయి. ఆ రెండక్షరాలకు మారుపేరే అమ్మ. అమ్మకు రైతుకు లంకె పెట్టి తన అమ్మను తన గుండె గోడ మీద శాశ్వత చిత్రం చేసుకొని ఇలా అనింది.

“రైతు లేక అన్నం వుండదు
అమ్మ లేక బతుకు ఉండదు “

అన్నం పెట్టేది అమ్మ. ఆ అన్నాన్ని పండించేది రైతు. ఇద్దరు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో కవిత్వపు చెట్టుకు ఇప్పుడే విరిసిన మొగ్గ వొకటి పరిమళించే మాటలతో నీటి పూల వానై కురిసింది.ఆ విరిసిన మొగ్గే “అర్చన “


కవిత్వంతో,కవిత్వం కోసం జీవించే కవులు వుంటారు కొందరు.అలాంటి కవులు తమ చుట్టు ఒక పరిమళ భరిత కాంతి దీపాల్ని వెలిగిఁచుకొని మరికొన్ని దీపాల్ని వెలిగిస్తుంటారు. అట్లాంటి కవుల్లో ఉపాధ్యాయుడు సుంకర గోపాలయ్య వొకరు .తాను పని చేస్తున్నదామా నెల్లూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక చిన్నారిని కవిత్వ దీపం చేశాడు కవిత్వ అర్చన చేయడానికీ.

సహజ జీవిత సన్నివేశాలు అంటే బాల్యంలో మేకలతో గొర్రెలతో ఆడుకున్న జ్ఞాపకాలు, అమ్మ నాన్నల ప్రేమలు,తరగతి గదులు, ఆ గదుల్లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, ఇల్లు ఇంట్లో రాజుకుండే పొయ్యి, పంట పొలాలు ఆ పొలంలో మట్టి, సముద్రాలు, కురిసే వానలు వీచే గాలులు, పెళ్లిల్లు పెళ్లిరోజు అమ్మాయికి పెట్టే నలుగులు అన్నీ ఇవన్నీ కవిత్వంలో కావ్య వస్తువులుగా మార్చిన కవుల్ని ఎందరినో నేను చదివివుండొచ్చు .

కానీ పైన చెప్పిన అంశాలన్నిటిని కవిత్వం చేసిన ఒక అమ్మాయి అందునా తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి కవిత్వాన్ని నిన్న చదివా. “ మనిషికి ఏం కావాలి ? కాసింత దయ ,ప్రేమ “ అని అంటారు బుచ్చిబాబు గారు “ చివరకు మిగిలేది అనే నవలలో. అట్లాంటి ప్రేమను దయను ఆకాంక్షించడం అందరికి సాధ్యం కాదేమో ? తన జాతి స్త్రీల పట్ల ప్రేమ అనుకంపలతో ఒక ఆలోచనని ఈ కవయిత్రి ఇట్లా ఇచ్చింది.

“ నా హృదయానికి బాధ కలిగితే
నా కన్నుల కలువ పూల నుండి
బాధా మకరందాన్ని
నేను కూడా స్రవించగలను
ఏడిస్తే
బాధ తీరిపోతుందనుకుంటే
కన్నీటితో
ఒక కొలను సృష్టించగలను
ఏడుస్తూ కూర్చుందామా
బాధలను తరిమేస్తూ… తరిద్దామా “

పై కవితా పంక్తుల్ని గత ఆదివారం అనంత పురంలో రాధేయ గారి ఉమ్మడిశెట్టి సాహిత్య పురస్కారం శ్రీసుధ మోదుగ గారికి ప్రదానం చేసిన సభ అనంతరం ఒక కవయిత్రి బహుశా విద్యాధరి గారనుకుంటాను “ ఈ అమ్మాయి ఎంత గొప్పగా రాసిందో చూశారా” అంటూ చదివి వినిపించింది. తాను రాసిన కవితల్ని వినిపించడమేకాదు ఈ సుంకర గోపాలయ్య చేసింది సి.నా.రె, శ్రీ శ్రీ, తిలక్, శివారెడ్డి ,శిఖామణి, ప్రసాదమూర్తి.గంటేడ గౌరినాయుడు, సావిత్రి, విమల ,ఎండ్లూరి మున్నగు కవుల్ని ఆ అమ్మాయి మనో తరగతి గది లోకి ప్రవేశపెట్టాడు.అప్పుడు దామా నెల్లూరు తెలుగు కవిత్వపు మాగాణి మీద మొలకెత్తిన మొదటి విత్తనమయ్యింది ఈ కవయిత్రి. అలా మొలకెట్టిన మొదటి కవిత్వ విత్తనమే “అర్చన”.

ఈ పై కవిత్వ వాక్యాల్లో కొత్త ఊహ కనిపించింది నాకు. ముఖ్యంగా దుఃఖవిషయాలు వచ్చినప్పుడు వాటిని నూత్న దృక్కోణం నుంచి ఈ కవయిత్రి చూసినట్లనిపించింది నాకు.’”నేను ఏడువగలను.కన్నీటి కొలను సృష్టించగలను.ఏడుస్తూ కూర్చున్నంత మాత్రానా బాధలు తొలగిపోతాయా?” – అని ప్రశ్నిస్తూ.. ఆ బాధల్ని ‘తరిమేద్దాం’ అని పిలుపునిస్తుంది ఈ కవయిత్రి. ఇందులో కొత్త ఊహ ఏముంది ? అని అనుకోవచ్చు ఎవరైనా. ఇట్లాంటి ఊహ వొచ్చింది ఏ ప్రసిద్ధ కవికో కవయిత్రికో కాదు తొమ్మిదో తరగతి చదువుతున్న పదునాలుగేళ్ళ పాపకీ.అందుకే కొత్త ఊహ అని అంటున్నా.ఎంత కొత్త ఊహతో అర్చన జీవితంలో జరిగే నలుగు పెట్టడం అనే ఒక సహజ సంఘటనని కవిత్వం చేసిందో చూడండి.

“ ఈ రోజు
మా అక్క చక్కని చుక్కలా
నేలపై వుంది.
మా అక్కకు నలుగు పెడుతున్నారు
అది ఎలా వుందంటే
నిండు చందమామకు
నూనె నలుగు పెడుతున్నట్లుంది
ఆ సూర్యుడు
మా అక్క నుదుటన
కుంకుమయ్యాడు
ఆ నక్షత్రాలన్నీ
మా అక్క తలపై
అక్షింతలై పడ్డాయి
మా అక్క కట్టిన చీరకు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు వచ్చి
రంగులద్దినట్లుంది.”

చుక్క ఆకాశంలో కదా వుండాలి కానీ ఈ చిన్నారి కవయిత్రి నేల మీద వుంది అంటుంది తన అక్కను వొక చుక్కను చేసీ. చుక్కలా వాళ్ళక్క అక్కడ పెళ్ళి అవబోతుందన్న సంతోషపు మెరుపుతో మిళ మిళ మెరిసిపోతుందన్న వొక ఊహను ఈ అర్చన అందిస్తుంది చదువరికీ. నిండు చందమామకు నలుగు పెట్టడానికి నూనె రాస్తే ఎట్లా వుంటుందంటే తన అక్క లా వుంటుదని చెబుతూ..సూర్యున్ని తన్న అక్క నుదుట వెలిగే సింధూరాన్ని చేసింది. సూర్య కాంతి పడితేనే కదా చంద్ర బింబం ప్రకాశించేది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. నక్షత్రం స్వయం ప్రకాశకం .అందుకే అర్చన తన అక్కను చుక్కతో పొల్చింది. ఒక సార్థక్యాన్నిఅద్భుతంగా సాధించింది.

గాలి ని చూళ్ళేం.కేవలం స్పర్శతో మాత్రమే తెలుసుకోగలం అది కూడా ఆ గాలి మనల్ని స్పృశిస్తేనే మనల్ని. ఆ గాలి మనలో వుంటేనే మనం సజీవంగా వుండేది.అట్లాంటి గాలికి మానవారోపణ చేసి అది తన మిత్రురాలు అంటుంది అర్చన. ఆగాలిలోంచే వచ్చే తరంగాలను స్వీకరించి మనం దానికి ఊపిరాడనీకుండా పర్స్ లో లేదా జేబులో దాచుకున్నా తియాటి ఊసులు వినిపిస్తుంది సెల్ ఫొన్. ఆ సెల్ ఫోన్ ఎంత ఖుషీని ఇస్తుందో అంతే ప్రమాదాన్ని తెస్తుందన్న ఎరుక కూడా ఈ కవయిత్రి కలిగి వుండటం ఆశ్చర్యం.

నిత్య నైమిత్తిక జీవితంలోని దృశ్యాల్ని కొందరు కవులు అందంగా కవిత్వం చేశారు. శిఖామణి గారు వాళ్ళమ్మ పొయ్యి రాజేసిన దృశ్యాన్ని పదాల వర్ణాలతో భావాల జిలుగులతో బొమ్మ కట్టించారు. అర్చన కూడా వాళ్ళమ్మ పొయ్యి రాజేసిన చిత్రాన్ని..కవిత్వంగా మార్చింది.అయితే అనుకరణ కాదు. ఆ కవిత ఇచ్చిన ప్రేరణతో చేసిన అనుసణ సృజన.ఏకవికైనా కవిత్వం రాసే కొత్తలో ఇలా ప్రేరణతో అనుసరణ సృజన చేయడం తప్పనిదే.

“మా అమ్మ
పొయ్యి రాజేస్తుంది.
అప్పుడు అమ్మ ముఖం
ధగ ధగ మెరిసే సూర్యుడిలా ఉంటుంది
జాబిలమ్మ దాచిన మబ్బులా
పొగ మా అమ్మని కమ్మేస్తుంది.”

తనకు తెలిసిన పోలికల్నే అర్చన అందంగా తన భావానికనుగుణంగా అమర్చుకునే విద్య తెలుసుకున్నట్లుంది. వాళ్ళమ్మ పొయ్యి రాజేయని రోజు తనే కాదు పొయ్యి కూడా ఏడుస్తుందనే ముగింపు ఇస్తుంది.పొయ్యి ఏడుస్తుందని చెప్పడం ఒక కొత్త చూపు. ఏడ్చాక ముఖం కళావిహీనంగా వున్నట్టు పొయ్యి రాజేయకపోతే అదికూడా కళారహితంగా చల్లారిన బొగ్గులతో బుగ్గి బుగ్గి అయిన బూడిదతో వుంటుందనే భావనను అర్చన “పొయ్యి కూడా ఏడుస్తుంది” అనే ఒక్క మాటతో సాధించింది.

ఉపాధ్యాయులు ఎలా వుండాలో అర్చన గుండె పువ్వు విచ్చుకునేలా చెప్పడమే కాకుండా వాళ్ళ తెలుగయ్యోరు వాళ్లతో ఎలా వుంటాడో ఏమేమీ బోధిస్తాడో ఇట్లా రాస్తుంది.

“ఆయన వెంట ఉంటే చాలు
జ్ఞానం భుజం పై చెయ్యేసీనట్లుంటుంది
మా గుండెల్లో ఉండే దిగులును
మా ముఖాల్లో కన్పించే బాధలను
ఆయన ఇట్టే పసిగట్టేస్తారు
ఆయన పాఠం మాకు భరోసా”

ఒక గమ్మత్తైన సంగీతం తన కవిత్వం లో ప్రవహింపచేస్తుంది ఈ కవయిత్రి. ఈ అర్చన ఏమీ రాయని తెల్ల కాగితమో పలకో కాదు. తన మనసును తన హితురాలుగా చేసుకొని ప్రకృతిలోని ప్రతీక్షణాన్ని తన హృదయంలో బందీ చేసుకొని ఆ క్షణాలు కవిత్వమయ్యాక వాటిని వేలు పట్టి వెలుగులోకి తీసుకొస్తున్నటుంది. అందుకే అర్చన కవిత్వంలో పచ్చని ప్రకృతిలా కవిత్వం పందిరిలా అల్లుకుంది.

“పచ్చని కోకతో 
ప్రకృతి ముస్తాబైంది
గల గలమని గజ్జెలు కట్టుకొని
నది ప్రవహిస్తుంది
మేఘం చిటపట చినుకులుగా మారి
ప్రకృతి ప్రియురాలితో చిందులు వేస్తున్నాడు
లేత ఆకుల నున్నని చిగురులపై
నీటి బిందువులతో నిమురుతున్నాడు”

లేత ఆకుల నున్నని చిగురుల్లాంటి పదాల సోయగమే కాదు అర్చన కవితల్లో భూమాత గుండె చప్పుళ్లు కూడా వినిపిస్తాయి.పచ్చని పంట భూముల్ని కాంక్రీట్ జంగిల్ ల్లాంటి రాజధాని కోసం రైతులు ఇచ్చారన్న విషయాన్ని విని రాసిన కవిత ఇది.

“ఈ మట్టే కదా
పూలైంది,పండ్లైంది
మా పొలంలో గింజైంది
నా నోటికాడ ముద్దైంది
మా పెరట్లో చెట్టైంది
నాక్కొంచెం మట్టి కావాలి
మట్టిని బ్రతకనిస్తారా “

ఇట్లా తన గుండెలో గూడు కట్టుకున్న సంతోషాన్నో దుఃఖాన్నో శబ్దంగా మార్చి కవిత్వం చేస్తున్న అర్చనకు రైతు కన్నీటి స్పర్శ తెలుసు. అత్త మరణిస్తే అత్త కొడుకు కన్నీటి వర్షమై కురిస్తే …అతన్ని కవిత్వంగా మార్చడం తెలుసు. విజ్ఞానపు వెలుగులు పంచేది తరగతి గదేనని స్పష్టంగా అర్చనకెరుకే. బ్యాగులు మోయాల్సిన వయసులో గుండెలపై మంగళ సూత్రాలేంటి అని నిలదీయడం ఈ అమ్మాయికి తెలుసు. చదువు కొమ్మలకు ఊయల ఊగాల్సిన విద్యార్థులు చావు మెట్లపై నిలబడుతుంటే .. ‘మరణం కోసం ఆరాటం ఎందుకు? గెలిచే వరకు బ్రతుకలేమా ? ‘ అని ధైర్యం నూరిపోయడం తెలుసు ఈ అర్చనకు.

తరగతి గది లోంచి కవిత్వపు జీవితంలో మొదటి మెట్టు ఎక్కుతున్న అర్చన వేసిన తొలి అడుగే బలంగా వేసింది తన” నీటి పూల వాన “తో. బుల్లి బుల్లి అడుగులతో చదువరుల గుండెల్లో కవన ముద్ర వేస్తున్న అర్చనను అభినందిస్తూ…

చిన్న వయసులో కవిత్వం ప్రచురించుకోవడం తప్పు అని అనను కానీ.. ఇదే గొప్ప కవిత్వమని భావన ఎదలోనికీ రానీకుండా.. మరిన్ని గొప్ప కవుల కవిత్వాలను అధ్యయనం చేస్తూ తనదైన శిల్పాన్ని సాధించుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

( ఈ వారం కవితాంత రంగంలో “ నీటి పూలవాన “ కవయిత్రి అర్చన )

No Comments

Post A Comment

You don't have permission to register