‎Rajaram Thumucharla‎

_Rajaram Thumucharla_

‎Rajaram Thumucharla‎

“ వర్ణ ధర్మం చేసిన పుట్ల కొద్ది గాయాల్ని అగ్గి గొంతుతో ప్రశ్నించే కవిత్వం అతనిది “

~
రాజారామ్ .

మనసు కలుక్కుమన్నప్పుడల్లా బతుకులోని అల్లకల్లోలాన్ని గుండెలోని వ్యథను అక్షరాల్లోకి వొంపే వొక కవిని మే నెల చివర్లో జరిగిన కవి సంగమంలో చూశాను.జీవితానికి అవమానానికి తేడా తెలియని ఈ సుందర దేశంలో ,,జీవితమంటే అవమానాన్ని మౌనంగా భరిస్తున్న దేశంలో తన జాతికి వర్ణ ధర్మం చేసిన పుట్ల కొద్ది గాయాల్ని అగ్ని గొంతుతో ప్రశ్నించే కవిత్వాన్ని రాసే కవి అతడు.

నాలుగువేల ఏండ్లనుంచి భరిస్తున్న నిచ్చెనమెట్ల వ్యవస్థపై చెప్పులు ముడిసే ఆరె,రంపె,పన్రాయి లు ప్రతీకారానికై పళ్ళునూరే సందర్భంలో వలస దుఃఖంతో పొలమారిన పాలమూర్ జిల్లా లో ఎగిసిపడుతున్న దళిత చైతన్య రవళి అతని స్వరం. కుల ఉగ్రవాదాన్ని అమెరికా పెత్తందారి పెత్తనాన్ని చెప్పులు ముడిచే గూటంతో గుద్దాలనే ఆలొచనతో కవిత్వం రాసే కవి అతడు. అందమైన దండోరా ఉద్యమంలో వర్గీకరణను శ్వాసలా హత్తుకుంటున్న కవి అతడు. ఆ కవి ఎవరంటే గుడిపల్లి నిరంజన్.

నిరంజన్ కలం చేవ వున్నది. “లందపొద్దు” అనే బహుజన కవిత్వ సంపుటిని , “ఎరుక “ అనే దీర్ఘకవితని నిరంజన్ వలస దుఃఖపు నేలపై మొలిపించాడు. ఈ గుడిపల్లి నిరంజన్ రాసిన “లందపొద్దు” లోని కవిత్వాన్ని గూర్చి ప్రముఖ విమర్శకుడు బహుజన వాద తాత్వికుడు జి.లక్ష్మీనరసయ్య గారు ఇలా అంటాడు .” ఉరకలు వేసే ఉద్వేగాల్ని,సెగలు లేపే ఆలోచనల్ని సమ పాళ్ళలొ కలిపి దృశ్యమానం చేసిన ఈ కవి చేవకు “లందపొద్దు” సరయిన నిదర్శనం “.

“నిజానికి 
సూర్యుడు ఒక పువ్వే
వేకువ జామున మొగ్గై
మిట్ట మధ్యాహ్నం విచ్చుకున్న పుష్పమై
సాయంకాలం వాడిపోయి
పడమటి కొండల్లో రాలిపోతాడు.
మరి మనిషి..?

సూర్యోదయాన్ని పూమొగ్గ ఆవిర్భావం తో మిట్ట మధ్యాహ్నం మార్తాండున్ని వికసించిన పూవుతోను ,సాయంకాలం అస్తమించే అర్కున్ని వాడి రాలిపోయే పూవుతోను కవి నిరంజన్ ఈ పై కవితలో పోల్చి చివరిలో మనిషి..అని అంటాడు. ఈ కవితలో వాచ్యంగా పూవు సూర్యుడు మాత్రమే చెప్పబడివుండొచ్చు.కానీ ఇందులో మనిషి జీవన దశలను కూడా ధ్వనించాడు.

పూవు సున్నితత్వం పరిమళించే తత్వం జీవించినంతకాలం ఇతరుల కొరకు జీవించడం మనిషి కలిగివుండాలని చెబుతున్నాడేమో అనిపించింది. సూర్యుని లా ఉదయించి మధ్యాహ్న భాస్కరునివలే ప్రకాశించి సాయంకాలపు భానుడివలె జీవిత చరమదశకు మనిషి చేరుకోవాలనే వొక మర్మత్వాన్ని ఇందులొ చెప్పాడేమో అనిపించింది.

మార్క్సిజాన్ని బౌద్ధాన్ని దళిత అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని బలంగా తనలో నిక్షిప్తం చేసుకోవడమేకాదు తన కవిత్వంలో కూడా దట్టించిన కవి నిరంజన్.జగన్ రెడ్డి అన్నట్లు తన కవిత్వాన్ని ప్రజాస్వామిక పద్దతిలో మాదిగీకరణ చేస్తూ దళితైజేషన్ ని ఈ కవి ప్రతిపాదిస్తున్నాడు.కాబట్టే ఇలా అనగలిగాడు.

“నా జాతి చరిత్ర
నా జాతి ప్రకృతి విలువల
నా జాతి గణ రాజ్యాలు
నా జాతి సౌందర్యాత్మక పని విలువలు
వేల సంవత్సరాలనుంచి
యజ్ఞంలో తగలబడుతూనే ఉన్నాయి “

కుల వర్ణ వ్య్వస్థకు మాతృక ఈ భారత దేశం. ఈ దేశంలో మగవాడైన బ్రహ్మ పాదాలు మున్నగు అవయవాలనుండి మనుషులు జన్మించారని చెబుతుంటే నమ్మేవాళ్ళు అనేకం.ఆధారం లేని అబద్ధాలు అందంగా చెబుతుంటే నమ్మే వాళ్ళ అమాయకత్వాన్ని ఈ కవి నిలదీశాడు ఈ సంపుటిలొ.పక్క మతం వాడిని ద్వేషించడమే దేశభక్తిగా చలామణి అవుతున్న దశలో నిత్యం అనుమానించి అవమానపడే వారి పట్ల వర్ణధర్మం చూపిస్తున్న వివక్షతను ప్రశ్నిస్తూ ఈ నిరంజన్ అట్లా వివక్షను చూపించే వాళ్ళ కాళ్ళ కింది మట్టి కదిలిపోయేలా కవిత్వమై ప్రవహించాడు.

“కడుపుల కత్తెర్లు నోట్లో సక్కెర్లు “ పెట్టుకొని పైకొకటి లోపల ఇంకొకటి వుంచుకొని పక్కనున్న సాటి మనిషిని అతని మతాన్ని ద్వేషించడమే దేశభక్తిగా భావిస్తున్న కొందరి కుట్రల్ని ఎండగట్టే కవితల్ని నిరంజన్ రాశాడు.అట్లాంటి దేశభక్తి తనకవసరం లేదంటాడు.

“ఈ దేశపు
మట్టి నాదే
ఈ దేశపు మనిషిని నేనే..!!
పక్క మతం వాడిని
ద్వేషించడమే దేశభక్తి అంటే
ఆ దేశ భక్తి నాకొద్దు ! “

వర్ణ అహంకారంతో నదుల్లో నీరు పారినట్లుగా ఈ నేల మీద నెత్తురుని కూడా కొందరు పారించారు. కారంచేడు ,వేంపెంట ,ఇందుల్ వాయి, కంబాలపల్లి,కల్వకోలు, ఖైర్లాంజీ, ప్యాపిలి,లక్ష్మింపేట మున్నగు చోట్ల తనజాతి గుండెలకు అయిన గుర్తుచేస్తూ..ఈ గాయాల్ని చేసింది విదేశీయుడు కాదు ఈ దేశీయుడే అనే కొన్ని కన్నీళ్ళ నిజాల్ని కవిత్వంగా మార్చాడు నిరంజన్.

మనుషుల మధ్య ఆరని చిచ్చు పెట్టిన వర్ణ చరిత్ర చర్మాన్ని చెప్పుగా కుట్టాలని ఉందంటాడు ఈ కవి. ఈ మాటల్లో వున్నది కసి కాదు.జరిగిన జరుగుతున్నకొత్త కుట్ర గురించి చెప్పడమే.అట్లా చెప్పడం మాత్రమే కాదు ఆ కొత్త కుట్రల పొట్టపై డప్పుకొట్టడమే. ఈ వర్ణ చరిత్ర కుట్రలు బద్దలు కావాలంటే దళితులు పార్లమెంట్ రూపకర్తలు కూడా కావాలని,అంతేకాదు ఎక్కెక్కి ఏడ్చే వారి గొంతుల్లో అంబేద్కరిజమ్ , బౌద్ధం ధ్వనించాలనే స్పృహను ఇస్తాడు ఇలా.

“సంవిధాన రూపకర్తనైన నేను
పార్లమెంట్ రూపకర్తనవ్వాలి!
అప్పుడు
అవమానాన్ని
జీవితం నుంచి వేరు చేసి
తిరిగి తిరిగి
బౌద్ధ జీవితం ప్రారంభిస్తాను “

ఈ కవిలో కలగాపులగపు భావాలు కనిపించవు బహుజన దారులను నిర్మించడం తప్ప. కొత్తకొత్త జవసత్వాలు నింపుకోవడ్మే కాదు కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిన అవసరాన్ని తన వాళ్ళకి సూచిస్తాడు. ఈ దేశంలో కొందరికి మనిషి కన్నా గోవులపై ప్రేమ ఎక్కువ కావడాన్ని వ్యంగ్యంతో నిరసిస్తాడు.

“పక్కనున్న మనిషిని
అస్సహించుకుంటూ
ధర్మశాస్త్రాలు బహు గొప్పవంటాడతడు
మనిషి ఆకలిపై
లేని ప్రేమను
గోవులపై కుమ్మరించ్చిండు
విశ్వమానవ ప్రేమ వర్థిల్లాలని
త్రిశూలం పైకెత్తిండు..!
బహుజనులూ జాగ్రత్త..! “

బహుజన వాదం భవిష్యత్తులో బలం పుంజుకొని ఈ దేశమంతా రాజ్యాధికారపు డప్పుల దరువై మోగుతుందనే ఒక సత్యాన్ని చెబుతూ అప్పుడు మొక్కులుండవు సిందుతొక్కుడే వుంటుందని నేల లోపల పడిన విత్తనాలు అంకురించి మొలకెత్తే మొక్కలై అవే వనాలైనట్లు బహుజన వాద భావాలు మనుషుల మదిలో నాటబడి అవి మొక్కల్లా పెరిగి ఈ దేశంలో వనాలై విస్తరించి కమ్ముకొని రాజ్యాధికార దిశగా గాలుల్ని వీస్తాయనే ఆలోచనని కవిత్వంగా ఈ కవి మలిచిన తీరు అతని శిల్ప నేర్పుకు గీటురాయే.

“విత్తులు భూ గర్భంలో
రహస్యంగా సంభాషించి
పక్కున పగిలి
పైపైకి దూసుకొస్తున్నాయి..
విత్తులు
సిన్నగా 
మొక్కలైతాయ్
నా జంబూద్వీప
గణ రాజ్య వనాలైతాయ్.. “

కళలన్నీ మాదిగ వాడలోనే పుట్టాయని అవి దైవికంగా అబ్బినవి కాదని జైవికంగానే వచ్చాయని ఆ మాదిగ జీవితం నిండా కళలేనని మన కనురెప్పల కదలికలు ఆ వైపే ఆర్పకుండా చూసేటట్లుగా తన అక్షరాలతో దరువేయిస్తాడు ఇలా.

“కనురెప్పల కదలికలు
నొసట బొమ్మల ఎగిరేత
రూపాయి బిళ్ళ బిళ్ళ నొసట్లో సూర్యుడై
భూగొళం డప్పై
సిడతల భజన సిటుకులు
జడకొప్పు కోలాటం
జమిడికే డప్పు దరువులు
జీవితం నిండా కళలే
కళలన్ని మాదిగ వాడలో
జైవికంగా అబ్బినవే..! “

ఈ కవి ఈ దేశ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితుల్ని కూడా తన కవిత్వంలోకి తీసుకొస్తాడు. ఈ దేశం సంతగా మారి ప్రతిదీ అమ్మక వస్తువుగా చూడబడుతున్నప్పుడు మనిషితనానికి చోటు కరువే. ఆ అంశాన్ని తక్కువ మాటల్లో గొప్ప అర్థంతో స్ఫురింపచేస్తాడు.ఈ మాటలతో “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అన్న అందెశ్రీ ని గుర్తుకుతెస్తాడు.

“అమ్మకం కొనుగోళ్ళే
మనిషి జీవితమనుకుంటున్న ఈ రోజుల్లో
మనిషి కన్నా
మనిషి తనానికి విలువిచ్చే..
మనుషుల కోసం వీక్షిస్తున్నా

మార్కెట్ విస్తరిస్తుంటే..
మనిషి అంతర్థానమై పోతున్నాడు “

సామాజిక న్యాయ వర్గీకరణను డిమాండ్ చేస్తూ నిరంజన్ రాసిన “అన్నం గిన్నెలో అగ్ని పర్వతం “ – అనే కవిత ఒక జాతి అంతర్వేదన. ఈ వర్గీకరణ డిమాండ్ ‘ఒక ప్రవాహమై గంభీరమైన సుడులు తిరిగి నదిగా తయారైంది.’ ఆ ఉద్యమ నదిలో అతనొక సుడి అయితే తప్ప ఇట్లా రాయలేరు ఎవరైనా. ‘రిజర్వేషన్ల అన్నం గిన్నెలో అగ్ని పర్వతం బద్దలవ్వాలి 59 ముక్కల్ని సమానంగా ఏరుక తినాలి’ – అనే తన జాతి ప్రజల డిమాండ్ ని మంచి కవిత్వంగా వాళ్ళ దైనందిన జీవితపు అనుభవాన్ని మిళితం చేసి నిరంజన్ తన జనం కోసం రాశాడు.

“కలసి తిన్న అనుభవం
ఒక ఎక్కిరింతైంది
సోదరుడు మూలుగలన్నీ పీల్చినాక
ముడిబొక్కలు నాకిచ్చిండు
కాడ్జాలు సప్పలు ఎగరేసుకపోయి
కాళ్ల గిట్టెలు మిగిల్చిండు
సప్పకున్న కండ కూర
ఎండుతుంకల దండెంపై ఆరేసుకొని
గొడ్డు బక్కదన్నాడు
ఐనా కలిసే తిందామంటాడు
కల్సి తిన్న అనుభవం
ఒక్ల ఎక్కిరింతైంది
ఆకలి పేగుల అరుపుల
అంటరాని రాగమాలికైంది
నిజంగా చెబుతున్నా
నాకు కలసి తిందామంటే భయం “

తన జనం బాధల్ని ఎంత సక్కంగా కవిత్వం చేస్తడో తన ప్రజల సంస్కృతి అయిన బతుకమ్మపండుగను కూడా అంతే సక్కంగా కవిత్వం చేశాడు ఈ నిరంజన్.

“తీరు తీరుగ పూల పొదలు
ఎదలు పొంగిన సౌందర్యమై 
సబ్బండ కులాల బత్కులు
పూలరంగుల రాగాలతో రంజిల్లుతున్నప్పుడు
పల్లె అలలపై
పాటల వల విసిరింది బత్కమ్మ !”

చింతచెట్టు కొమ్మల సందుల్లోంచి నింగినుండి చూస్తున్న చంద్రుడు ‘కిల్కున తెల్లగా నవ్విండు’ అన్న మాటతో చంద్రోదయాన్ని అందంగా చెప్పాడు ఈ కవి.ప్రపంచీకరణ వ్యాపారీకరణ ఆధునీకరణ అనే అన్నీ చర్మకార వృత్తిని ధ్వంసం చేసీ మాదిగ అవశేష జీవిత సమాధులపై జెండాలై ఎగిరే దృశ్యాల్ని కూడా ఈ కవి తన కవిత్వ అద్దం లో చూపెడతాడు.

హైద్రాబాద్ అంటే అసెంబ్లీ, అబిడ్స్ ,ఆర్ట్స్ కాలేజ్, హైటెక్ సిటీలే కాదు తన జాతి రక్త మాంసాలని ఈ కవి చెబుతూ శతాబ్దాలుగా మాదిగ వాసన వొచ్చిన మట్టిన కులీకుతుబ్ షా వొచ్చి అత్తరు పూసిన నగరమని చరిత్రని కవిత్వం చేశాడు ఈ నిరంజన్ ఇలా.

ఒకనాడు
మాదిగ జాతి గుండెల మీద పరుచుకున్న నగరం
నేడు కాంక్రీట్ జంగలై
మా బొందల మీదికి విస్తరించింది
సాలార్ జంగ్ మ్యూజియంలో దాచిన 
నిజాం తొడిగిన కిర్రు తోలు చెప్పులనడుగు “

అంటూ ఉత్పత్తి కులాల నోట వెలువడే కవితాత్మక భాషలో హైద్రాబాద్ డప్పు కుదురులా పోల్చి చెబుతాడు.

పేదోళ్ళ స్పార్టకస్ గా మానవ హక్కుల నేత బాల గోపాల్ ని కవిత్వం చేశాడు. ఈ కవి ఊహశక్తి మాటలకందనిదే. దండోరద్యోమంలో అమరుడైన సురేందర్ మాదిగను స్మరిస్తూ రాసిన స్మృతి కవితలో సురేందర్ గారి నవ్వు నింగిలో చందమామై నిలిచిందని గొప్ప ఊహతో చెబుతాడు ఇలా.

“నక్షత్రం పేలినప్పుడు
అంతరిక్షంలోకి
విసిరివేయబడిన
అన్న సురేందర్ మాదిగ నవ్వే
చందమామ “

అట్లాగే ‘కళ్ళు ఒళ్లు పల్లె పొత్తిళ్ళలో దాచి పల్లెను అమ్మగా స్వీకరించి పాటల మాలలల్లి పిట్టలు చెట్టుపై నిద్రించినట్టు మెరుపు తీగను మీటుతూ పల్లె ఎదపై పసిపాపలా” నిద్రించే గోరేటి వెంకన్నను పాలమూర్ బాద్ షా హైద్రాబాద్ షహన్ షా అని అంటూ ఆ వెంకన్నను సెముట దుక్కుల్లో పుట్టిన మట్టిపువ్వు గా చేసిన కవిత కూడా ఈ నిరంజన్ కవిత్వీకరణ నేర్పుకు నిదర్శనమే.గోరేటి వెంకన్నపాడేటప్పుడు ఆయన ఆంగిక వాచిక అభినయ దృశ్యాన్ని ఈ కవితలో నిరంజన్ రూపు కట్టించాడు.

పొగరుకే నెగడివెట్టి బహుజనదారులు నిర్మించాలనుకున్న నిరంజన్ కవిత్వం రాజ్యం పైనా రాజ్యం నిఘా పైనా నిప్పులు కురిపిస్తుంది.ఎంత నిప్పులు కురిపించినా ఈ కవి సంయమనం కోల్పోడు ఎక్కడ కూడా ఈ సంపుటిలో.సెజ్ లతో పల్లె జీతాలు సీజ్ అయిన సంఘటనల్ని కవిత్వంగా మార్చాడు నిరంజన్.

“అర్థవంతమైనది రైతు జీవితం
ఇవ్వాళ్ రైతు ముఖం
ఎండిన చెట్టోలే వాడిపోయింది..!
యాట గట్టి నాగలి మేడి పట్టి
పాటలు కైగట్టి సక్కని సాలుదోల్తూ
తన పాదాలు భూ యెదపై మోపితే భూ హృదయ స్పందన!
అప్పుడూ,,ఇప్పుడూ
భూమినే ఆలపించే గొంతు
నేడు బొంగురువోయింది “

సెజ్ డేగలు రైతు భూమిని కోడిపిల్ల్లా తన్నుకుపోతుంటే నిరసనపిడికెళ్ళు ఎత్తి కవిత్వమై నిరంజన్ పోరుకేకలు వేశాడు. తెలంగాణ ఉద్యమంలో అగ్గి గొంతుతో తన కవితల్ని పిడికిళ్ళు చేశాడు. సద్దాం ను ప్రతిఘటనకు నిలువెత్తు రూపం చేశాడు.గాజా సంఘటనకు కరిగి కవిత్వమయ్యాడు.

బతుకు మాధ్యమంలో మట్టి అనివార్యమని ఎరుక కలిగిన ఈ కవిని స్వాగతిస్తూ .. కవిత్వంలో అనల పతాకాల్ని ఎగరేసే కవిత్వాల్నే కాదు జారిపడ్డ చిరు నవ్వుల్ని,గుణ్డె గుండె నుండి ఉప్పొంగే ఊటలా తేలియాడే అలలలాంటి కవితల్ని కూడా రాయమని చెబుతూ..

(“లందపొద్దు “ సంపుటి కవి “ గుడిపల్లి నిరంజన్ “ ఈ వారం కవితాంతరంగంలో )

No Comments

Post A Comment

You don't have permission to register