‎Paresh Doshi‎

_Paresh Doshi_

‎Paresh Doshi‎

స్వరాలు తొడిగిన కవిత — 95

(లోకంలో వొక్క ప్రేమే కాదు ఇంకా చాలా రకాల బాధలూ వున్నాయి!)

ఇదివరకు తడమని కవిని లేదా గాయకుడిని/గాయకురాలిని పరిచయం చేయాలని ఆలోచిస్తుంటే అసురగారు ఈ పాటను గుర్తు చేశారు. పాడినది నూర్జహాన్. లతా మంగేష్కర్ తన ఫేవరెట్ గా చెప్పుకునే నూర్జహాన్. దేశవిభజనప్పుడు నూర్జహాన్ పాకిస్తాంకెళ్ళిపోయారు. లత తన పద్నాల్గేళ్ళ వయసప్పుడు వొక హిందీ చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రంలో నాయిక నూర్జహాన్. మొదటిసారి అలా కలిశారు వాళ్ళు. లత బాగా పాడుతుందని తెలిసి ఆమె పాడించుకున్నది. తర్వాత మెచ్చుకుంటూ నువ్వు సాధన మాత్రం విడువకు చాలా పైకి వస్తావు అని ఆశీర్వదించింది. నేనెంతలెండి లాంటిదేదో అనబోతే వారించి, “నీకు అల్లా ఇచ్చిన గుణం వుంది, దాన్ని తక్కువ చేసి యెప్పుడూ మాట్లాడవద్దు. అది నీకు లభించినందుకు యెప్పుడు అతని పట్ల కృతజ్ఞతగా వుండు” అన్నారామె. వొకరోజు నూర్జహాన్ నమాజు చదువుతుంటే ఆమె యెదుట కూర్చుని అలా చూస్తూ వుండిపోయింది. లతకు ఇదంతా కొత్త. వున్నట్టుండి నూర్జహాన్ కళ్ళల్లో కన్నీరు. నమాజైపోయాక లత అడిగిందట దేవుడి ముందు కన్నీరు కార్చటం దేనికని. నేను చేసిన పాపాలకు క్షమాపణలు కోరాను, కన్నీళ్ళు వాటంతట అవే వచ్చాయి అని జవాబు. ఆ పద్నాల్గేళ్ళ వయసులో ఇదంతా అర్థం కాకపోయినా గుర్తుండిపోయింది లతకు. నూర్జహాన్ పాటలు చాలా వున్నాయి. ఇది యెంచుకోవడానికి వొక కారణం ఇది ఫైజ్ వ్రాసినది కావడం. మన దగ్గర వాడ్రేవు చినవీరభద్రుడు కూడా నూర్జహాన్ మీద వో కవిత వ్రాశాడు. అది అవాజ్ దే కహాఁ హై పాటను గుర్తు చేస్తుంది.

తన సాహిత్యానికి నోబెల్ కు నామినేట్ అయిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1911-1920 మధ్య ఇప్పటి పంజాబులో పుట్టాడు. ప్రభుత్వ కళాశాల, ఒరియెంటల్ కళాశాలలో విద్యనభ్యసించి ఆనక బ్రిటీషు ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ టైంస్ కు ఎడిటర్గా కూడా వున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. లియాఖత్ పాలన కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడన్న నేరం మీద అరెస్టయ్యాడు. జైల్లో నాలుగేళ్ళకాలం గడిపినతర్వాత విడుదలై ప్రగతిశీల రచయితల సమూహంలో కలిశాడు. సోవియెట్ ప్రభుత్వం అతన్ని లెనిన్ పురస్కారంతో సత్కరించింది.

తను జైల్లో వుండగానే నూర్జహాఁ పాటలు విని ఇష్టపడ్డాడు. అతను జైలు నుంచి విడుదలయ్యాక నూర్జహాన్ అతన్ని కలిసినప్పుడు ఆమెను పాడమన్నాడు. అతన్ని ఆశ్చర్యపరుస్తూ తన రచనలల్లో తనకే అతి ఇష్టమైన ఈ పాటను నూర్జహాన్ తనే బాణీ కట్టి పాడి వినిపించింది. ఫైజ్ చాలా సంతోషించాడు. తర్వాత ఈ పాటను కైదీ అనే చిత్రంలో వాడుకోవడం కూడా జరిగింది. ఈ సారి ఆమె పాడినదే కాకుండా ఇతరులు పాడిన, చదివినవి కూడా జతచేస్తున్నాను. అన్నీ బాగున్నాయి. సురేఖా సిక్రీ, జొహరా సెహ్గల్ గొప్ప నటీమణులు, నాటకరంగంలోనూ, సినెమాలోనూ.

మీకు “తెరీ ఆంఖోఁ కే సివా దునియా మే రఖా క్యా హై” మజరూహ్ సుల్తాంపురి వ్రాసినది గుర్తుందా? ఆ వాక్యం ఇందులోంచి తీసుకున్నదే. అలాగే సాహిర్ పాట వొకటి “తుం అగర్ భూల్ భి జావొ తో యే హక్ హై తుం కో” గుర్తుందా? అదీ ఈ పాట ఆత్మను పోలి వుంటుంది. “Jindagi sirf mohabbat nahin kuchh aur bhi hai; Julf-o-rukhasaar ki jannat hi nahin kuchh aur bhi hai” మీద దృష్టి పెట్టండి.

ఇలా వ్రాస్తూ పోతే అంతే వుండదు. ఇప్పటికే చాలా రాత్రయ్యింది. అన్నట్టు గూగ్లల్లో ఇంకాగ్నిటో లో ఈపలక తెరిచి దీన్ని అనువదించాను. అంతా అయ్యాక పొరపాటున ఆ ట్యాబ్ కట్టేశాను. నా శ్రమంతా పోయింది. మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఈ సారి చాలా విషయాలు మరిచిపోయాను కూడా. ఇది రెండో సారి ఇలా జరగడం. మూడోసారి జరగకుండా యేదన్నా ఉపాయం వుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి.

“ముఝ్సే పెహెలీ సీ ముహబ్బత్ మెరే మెహెబూబ్ న మాంగ్” : ఫైజ్ అహ్మద్ ఫైజ్ రచన, బాణీ కట్టినదీ, పాడినదీ నూర్జహాఁ

నా దగ్గరినుంచి మునుపటిరకం ప్రేమను ఆశించకు ప్రియా
నీవు వున్నత మాత్రం చేతనే నా ప్రపంచమే కాంతిమయం అనుకున్నాను
నీ బాధ ముందు నాకు ప్రపంచపు బాధ్ యెప్పుడు పట్టిందని!
నీ ఉజ్జ్వలమైన మోము కారణంగా కాదూ లోకంలో వసంతం నిలకడగా వున్నది
నీ కనులు మినహా ఈ లోకంలో చెప్పుకోతగ్గది యేమున్నదని?
నేను నిన్ను పొందినంతనే నా పాదాక్రాంతమవదా నా విధి 
అలా జరిగిపోవాలని నేను కల గనడమే కాని…
లోకంలో వొక్క ప్రేమే కాదు ఇంకా చాలా రకాల బాధలూ వున్నాయి
కలయిక ఇచ్చే సాంత్వనే కాదు ఇంకా పలురకాల సాంత్వనలూ వున్నాయి

జలతారు, చీనాంబరాల కలలతో నేసిన
నల్లటి చీకటి రాక్షసమాయ శతాబ్దాలుగా అలముకొనే వున్నది
ప్రతి వీధిలోనూ యెక్కడ చూడు
రక్తంలో స్నానించి, బూడిదలో దొర్లించిన
తనువులు బజారున అమ్మకానికి కనిపిస్తాయి.

కాసారాల్లోంచి, రోగాల పుట్టల్లోంచి 
ప్రతి గాయమూ రసి స్రవిస్తూ దేహాలు
క్షణంపాటు చూపును నీవైపు మరలిస్తే
అప్పటిలానే అందంగా నీ దేహం అంతే ఆకర్షిస్తూ
కాని యేమి చేయడం!
లోకంలో వొక్క ప్రేమే కాదు ఇంకా చాలా రకాల బాధలూ వున్నాయి
కలయిక ఇచ్చే సాంత్వనే కాదు ఇంకా పలురకాల సాంత్వనలూ వున్నాయి

నా దగ్గరినుంచి మునుపటిరకం ప్రేమను ఆశించకు ప్రియా

(“కైదీ” (1962), ఫైజ్ అహ్మద్ ఫైజ్, నూర్జహాఁ, నూర్జహాఁ)

(original song)

mujh se pahli si mohabbat mere mehboob na maang

main ne samjha tha ki tu hai to daraḳhshan hai hayat
tera gham hai to gham-e-dahr ka jhagda kya hai

teri surat se hai aalam men baharon ko sabat
teri ankhon ke siva duniya men rakkha kya hai

tu jo mil jaaye to taqdir nigun ho jaaye
yuua na thaa maiane faqat chaha tha yuun ho jaaye

an-ginat sadiyon ke tarik bahimana tilism
resham o atlas o kam-ḳhab men bunvaye hue

ja-ba-ja bikte hue kucha-o-bazar men jism
ḳhaak me luthdey hue ḳhuun men nahlaye hue

jism nikle hue amraz ke tannuron se
piip bahti hui galte hue nasuron se

laut jaati hai udhar ko bhi nazar kya kiije
ab bhi dilkash hai tera husn magar kya kiije

aur bhi dukh hai zamane men mohabbat ke siva
rahaten aur bhi hain vasl ki rahat ke siva

mujh se pahli si mohabbat mere mehboob na maang

(“Qaidi” (1962), Faiz Ahmed Faiz, Noorjahan, Noorjahan)

No Comments

Post A Comment

You don't have permission to register