‎Paresh Doshi‎

_Paresh Doshi_

‎Paresh Doshi‎

స్వరాలు తొడిగిన కవిత — 87

(ఈ హృదయాన్ని పతంగిలా మార్చి యెగరేసే గాలులే నీ శ్వాశ!)

1980 లో వచ్చిన “కర్జ్” అన్న చిత్ర కథను ఆధారంగా చేసుకుని ఫర్హా ఖాన్ 2007లో “ఓం శాంతి ఓం” తీశారు. రెండూ విజయం పొందిన చిత్రాలే. అయితే వొక పాత చిత్రాన్ని బేస్ చేసుకుని, మళ్ళీ తీసి ప్రజలని మెప్పించడం కష్టసాధ్యమే. అది ఫర్హాన్ ఖాన్ చేయగలిగారు. అదనంగా ఈ చిత్రం కాస్త పేరొడీ లాగా, పీరియడ్ ఫిల్మ్ లాగా వుంటుంది. 70లలో అప్పటి నటులను, అప్పటి ఫేషన్లను జాగ్రత్తగా గమనించుకుంటూ తీశారు. రెండుకాలాలనూ చూసినవారికి ఇది అదనంగా నచ్చుతుంది. గుర్తుంటే ఇది వరకు “అందాజ్ అప్నా అప్నా” అని వో చిత్రం వచ్చింది. అదీ అంతే, చాలా సూక్ష్మంగా రెఫెరెన్సులు వుంటాయి, అవి అందితే అదనపు ఆనందం.

ఇక కథ క్లుప్తంగా ఇది: ప్రఖ్యాత నటి శాంతిప్రియను ముకేశ్ మెహరా అన్న నిర్మాత ప్రేమించినట్లు నటించి మోసం చేస్తాడు. ఆమె తను గర్భం దాల్చింది అని తెలియచేసినపుడు పధకం వేసి ఆమెను చంపేస్తాడు. ఆ టీం లోనే వో జూనియర్ ఆర్టిస్ట్ ఓం ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తే అతన్ని చంపేస్తాడు. వీళ్ళు ఇద్దరూ మరో జన్మ యెత్తడం, ముకేశ్ కు వో నాటకంలో అతను చేసిన పాపపు పని గుర్తుకు తెచ్చి శిక్ష పడేలా చేయడం అన్నది మిగతా కథ. కథ యెలా వున్నా ఆ నటనలు, పాటలు, హాస్యం, దర్శకత్వం ఇవన్ని వినోదాన్ని కలిగిస్తాయి.

ఇక ఈ పాట వ్రాసినది విశాల్ దడ్లాని. స్వతహాగా ఇతను గాయకుడు, కాని పాటలు కూడా బాగా వ్రాస్తాడు. యెక్కువగా పాప్ ధోరణిలో వ్రాసే ఇతను కథా కాలం 70లు, 80లు దృష్టిలో పెట్టుకుని ఆ సమయానికి తగ్గ పాట వ్రాశాడు. విశాల్-శేఖర్‌లు కూడా ఆ కాలానికి అతికే శ్రావ్యమైన సంగీతం అందించారు.

నాకు మొట్టమొదట ఆకర్షించిన వాక్యం : ఈ హృదయాన్ని పతంగిలా మార్చి యెగరేసే గాలులే నీ శ్వాశ . ఇది చాలదా ఈ పాటను యెంచుకోవడానికి! ఆమె మహానటి. ప్రజలంతా దూరం నుంచి ఆమెను చూడగలిగినా అదే పదివేలు (ఈ రోజుల్లో 10K అంటే యెంతని?!) అనుకుంటారు. అలాంటిది విచిత్ర పరిస్థితులు అనుకూలించి ఆమె ఇప్పుడు తనకు ఇంత దగ్గరగా వున్నది. మరి మనసు గాలిపటంలా తేలిపోవడం లో ఆశ్చర్యం యేముంది? ఆ గాలులు కూడా ఆమె విడిచిన నిశ్శ్వాసలైతేనూ. ముందే ఆమె వయ్యరపు వగలమారి చూపులు అతనిమీద మంత్రం వేసి ముగ్ధుణ్ణి చేస్తుంటే. ఇప్పుడు సమయం కలిసి వచ్చింది, తన మనసులో మాట ఆమెకు చెప్పాలా వద్దా అని సందిగ్ధం. ఇక్కడ వో తమాషా వుంది. అతను రోజూ కలల్లో ఆమెతో అంటున్న మాటనే మరోసారి ఆమె యెదుట అనాలా అని వుంది. మరలా అన్న పదాన్ని గమనించండి. అంటే అతను మనసులో ఆమెతో ఆ మాట చెప్పేశాడు కాబట్టి చెప్పేసినట్టే. ఇప్పుడు చెబితే చర్విత చరణమవుతుంది! యెంత ఆత్మ విశ్వాసం. (నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే అన్న తెలుగు పాట గుర్తుందా? అలాంటి విశ్వాసమన్నమాట!)

తర్వాత ఉర్దూ సాహిత్యంలో “మాహతాబ్” (చంద్రుడు), “ఆఫతాబ్” (సూర్యుడు) అన్న పోలికలు అందమైన స్త్రీ మోమును వర్ణించడానికి వాడే పోలికలు. ఇక్కడ ఆమె మోము సూర్యుడు అనలేదు గాని, వో కాంతి పుంజం లాంటి ఆమె మోము పరచిన పల్చటి నీడ చంద్రుడు అని వుంది! అంటే అంత తేజం వున్నా బహుశా కాల్చేసే గుణం లేదేమో. ఆమె వయ్యారపు చూపు ఇతని మీద పడటం ఆలస్యం వో ప్రళయమే వచ్చేసింది. ఇక అంతిమంగా అతనా ప్రళయంలోనే కొట్టుకు పోయి ఆవలి తీరం చేరాలని ప్రార్థిస్తాడు. కొన్ని పోలికలు వేరే సాహిత్యపు పంక్తులను గుర్తుకు తెస్తాయి. ఇక్కడ ఆ ప్రళయంలోనే మునిగి, తేలి ఆవలి వొడ్డుకు చేరాలనుకోవడం. ఇది నాకు జిగర్ మొరాదాబాది గజలును గుర్తుకు తెస్తుంది. “ఈ ప్రేమ అంత సునాయాసం కాదు. వో అగ్నిసంద్రాన్ని ఈది దాటాల్సి వుంటుంది”. దానికీ సిధ్ధంగా వున్నాడీ నాయకుడు!

విని ఆనందించండి మరి. యెందుకంటే శ్రావ్యమైన సంగీతం, అద్భుతంగా పాడిన కే కే, అందంగా చిత్రీకరించిన ఫర్హా ఖాన్ ల సమిష్టి కృషి.

“ఆంఖోఁ మేఁ తేరీ అజబ్ సీ గజబ్ సీ అదాయేఁ హైఁ” (ఓం శాంతి ఓం)

వింతైన కులుకులు గల కన్నులు నీవి
ఈ హృదయాన్ని పతంగిలా మార్చి యెగరేసే గాలులే నీ శ్వాశ

యెలాంటి రేయి ఇది, యెంత హాయైన రేయి ఇది
యెవరినైతే చాలా దూరం నుంచే చూసి ప్రపంచం మొహించిందో
ఆ వ్యక్తి ఈ రాత్రి నాకు ఇంత చేరువగా, అదృష్టం కాక మరేమిటి
యెంతో చెప్పాల్సి వుంది, కాని మనసు మూలల్లో వో ప్రశ్న
రోజూ కలల్లో నీతో చెప్పేదే ఈ క్షణాన మరలా చెప్పాలా వద్దా అని

నీ అడుగుల వెంబడే వో వెలుతురు పుంజమూ వచ్చింది
నీ మోము వెలుగు పరచిన పల్చటి నీడ కాదూ చంద్రుడు
నీ కన్నులు నా మీద మోపిన ఈ ప్రళయం 
పరిణామంగా నన్ను అందులోనే ముంచి ఆ వొడ్డు చేర్చమనే ఇక నా ప్రార్థన

(“ఓం శాంతి ఓం” (2007), విశాల్ దడ్లాని, కే కే, విశాల్-శేఖర్)

(original song)

Ankhon men teri ajabasi ajabasi adaaen hain 
Dil ko bana de jo patng saanse ye teri wo hawaaen hain

Ai aisi raat hai jo bahut khushanasib hai
Chaahe jise dur se duniya wo mere krib hai
Kitana kuchh kahana hai fir bhi dil men sawaal kahin
Sapanon men jo roj kaha hai, wo fir se kahun ya nahin

Tere saath saath aisa koi nur aya hai
Chaand teri roshani ka halkaasa ek saaya hai
Teri najron ne dil ka kiya jo hashr asar ye hua
Ab in men hi dub ke ho jaaun paar yahi hai dua

(“Om Shanthi Om” (2007), Vishal Dadlani, KK, Vishal-Shekhar)

No Comments

Post A Comment

You don't have permission to register