‎Paresh Doshi‎

_Paresh Doshi_

‎Paresh Doshi‎

స్వరాలు తొడిగిన కవిత — 88

(వచ్చేయి ప్రియతమా, నీకై పరచిన నా కనురెప్పల షామియానా కింద!)

వొకోసారి యేదో వొక పాట, లేదా అందులోదే వొక వాక్యం పట్టి పీడిస్తుంటుంది, వెంబడిస్తుంది, మనసంతా ఆక్రమించుకుంటుంది. మెదడులో ఆ పాట నడుస్తూ వుంటే, పల్లవి అయిపోయాక చరణంలో పదాలు గుర్తుకు రావు, ఆ మధ్యనుండే interlude music సాంతం నడిచేదాకా. ఇక ఆ రోజంతా అది వొక endless loop. నా జీవితంలో వొక మరపురాని రోజంతా మెదడులో తిరిగిన పాట ఇది : 
तुम अगर जाओ कहीं जाओ कभी 
वक्त से कहना ज़रा वो ठहर जाए वहीँ 
అయితే నిన్నటినుంచి మాత్రం ఈ వాక్యాలు వెంటబడుతున్నాయి
सूरज कहीं भी जाए तुम पर न धुप आये
तुमको पुकारते हैं इन गेसूवों के साये

ఇక వేరే పాట గురించి ఆలోచించే పనే పెట్టుకోలేదు. పాకీజాలో పాటలన్ని గొప్పవే. అయితే అన్ని పాటలూ అనువాదానికి లొంగవు. ఇది వీలవుతుంది అనిపించి ప్రయత్నించా.

1971 లో వచ్చిన పాకిజా మీనా కుమారి చివరి చిత్రం. విడుదలైన మొదట్లో జనాలను ఆకట్టుకోలేదు. కాని మీనా కుమారి చనిపోయిన వార్త వల్ల ఆమె చివరి చిత్రం చూడడానికి జనాలు బారులు తీరారు. అదీ గాకుండా ఇప్పటికీ ఆ చిత్రాన్ని వొక కళాఖండంగా గుర్తిస్తారు.

కమాల్ అమ్రోహీ దర్శకుడు. తన పనిలో వంద శాతం సంలగ్నత వుంటుంది. సంగీత సాహిత్యాలు, దర్శకత్వంలో అన్ని విభాగాలూ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ఇప్పటి తరంలో అలాంటివాడు సంజయ్ లీలా భన్సాలి. అయితే ఇద్దరి చిత్రాలను మాత్రం పోల్చలేము. యెందుకంటే భన్సాలివి చాలామట్టుకు ఆత్మ కుంచెం, కాయం భారి లాంటి చిత్రాలు. ఇక మీనా కుమారి నటన, రాజ్ కుమార్ సంభాషణలది చెప్పేదేముంది?! ఘులాం మొహమ్మద్ సంగీతం ఆ యేడు దుమ్ము రేపింది. ఈ నాటికీ వింటే మోహంలో పడిపోవడం ఖాయం. ఈ సినెమా తీస్తున్నప్పుడే ఘులాం మొహమ్మద్ చనిపోవడం, మిగిలిన భాగం (నేపథ్య సంగీతం) నౌషాద్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి ఘులాం పేరు ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ అయినా రాలేదు. అదే యేడు “ఉపకార్” చిత్రానికి గాను ప్రాణ్ కు అవార్డు వస్తే, ఆయన తిరస్కరించాడు. కారణం ఘులాం కు దక్కాల్సిన అవార్డు వేరే వాళ్ళకు (శంకర్ జైకిషన్?) వెళ్ళిందానికి నిరసన. చాలా రాత్రి అయిపోయింది. ఇంకా చాలా వ్రాయాల్సి వుంది; ఇంకో పాత తీసుకుని మరోసారి….

ప్రియతముడు దగ్గర లేనప్పుడు ఆమె అవస్థ యెలా వుంటుంది?
రుతువేమో మోహనంగా వుండి, అతని లేమిని మరింత నరకప్రాయంగా అనిపించేలా చేస్తుంది. యెవరితో చెప్పుకోగలదు తన బాధ? తన కోరిక? అందుకే తన మనస్సునే అంటుంది, యెక్కడినుంచైనా సరే అతన్ని వెతికి తెచ్చి తన ముందు నిలబెట్టమని.

అతను యెక్కడున్నాడో, యే యెండనపడి విరహాగ్ని తో పాటు వేగిపోతున్నాడో! అందుకే సూర్యుణ్ణి అంటుంది, నువ్వెటైనా వెళ్ళు అతని మీద నీరెండసైతం పడకుండా చూడు అని. అంత ప్రేమ, వ్యామోహం. అతనొస్తే తన కురులను పరచి ఆ నీడలో సేదతీరుతాడని భావిస్తుంది. (ఈ భావం హిందీ పాటల్లో చాలా తరచుగా వచ్చే విశేషం. ఇదివరకొకసారి ఆ వివరాలన్ని ఇచ్చాను.) అంతే కాదు తన కనురెప్పల షామియానాల కిందకొచ్చి సేదతీరమంటుంది. ఈ భావన మాత్రం నాకు ఇంకెక్కడా తగలలేదు. క్రూరమైన పగళ్ళు కాల్చుకు తింటుంటే, రాత్రులు యేకంగా చంపుకు తింటున్నాయి ఆమెను. విరహాగ్ని కాటుకు బలైన ఆమె అతని కౌగిలిలో యెప్పుడెప్పుడు సేద తీరాలా అని కలలు గంటుంది. యెలాంటి కలలు అవి?! కళ్ళ ముందు వున్నవి మిణుగురులా, చుక్కలా తెలీని పరవశం. అంటే తను నేల మీదే వున్నదా లేక ఆకాశం లో తేలుతున్నదా తెలీని మత్తు. కలేనా? వింతగా వున్నదే! తనకేమో నిద్రరాని కళ్ళు, ప్రపంచం మాత్రం నిద్రలో మత్తుగా జోగుతుంది! అన్యాయం కదూ!

ఈ పాట హిందీ రానివాడికి కూడా వొక్కసారి వింటే కట్టిపడేస్తుంది అంతే. అర్థమయ్యే వాళ్ళకు అదనపు ఆనందం. నేను వ్రాయకుండా మిగిలిపోయింది మరోసారి తప్పకుండా వ్రాస్తాను. లేకపోతే నాకు నిద్ర వుండదు! ప్రస్తుతానికి ఈ మత్తులో పడండి మీరు.

“మౌసం హై ఆషికానా” (పాకీజా)

హృదయమా ఓ మోహ హృదయమా!
మోహాన్ని రేపే ఈ రుతువులో
ఆయన్ని యెక్కడున్నా వెతికి తేవూ!

ప్రేమ రుతువులో నేను అతని విరహంతో తల్లడిల్లుతున్నాననీ,
నల్ల మబ్బుల నీడలు ఈ విరహిణిని కాటేస్తున్నాయనీ,
చెప్పవూ!
నన్ను చంపినా చంపేస్తుంది, ఈ వానని నమ్మేదెలా?!

సూర్యుడు యెటైనా వెళ్ళనీ, నీ మీద యెండపొడ అయినా పడకుండా వుండుగాక
ఇదిగో, వచ్చేయి నిన్ను రా రమ్మని పిలుస్తున్న నా కురుల నీడలో, నీకై వేసిన నా కనురెప్పల పందిరి కింద!

వొంటరిగా యెన్నాళ్ళిలా తిరుగాడనూ? 
ఇంకా యెన్నాళ్ళు ఈ విరహమూ?
క్రూర పగళ్ళు సరేసరి, రాత్రిళ్ళు కూడా చంపుకుతింటున్నాయే!
నువ్వు వచ్చి నను నీ కౌగిలిలో బంధించేదెప్పుడు?

ఈ రాత్రీ, ఈ మౌనమూ; కలలాంటి ఈ దృశ్యమూ
ఇవి మిణుగురులా, లేక నేలకు దిగిన చుక్కలా
నావేమో నిద్రరాని కళ్ళు, ప్రపంచం మాత్రం మత్తులో!

హృదయమా ఓ మోహ హృదయమా
మోహాన్ని రేపే ఈ రుతువులో
ఆయన్ని యెక్కడున్నా వెతికి తేవూ!

(“పాకీజా” (1971), కమాల్ అమ్రోహీ, గులాం ముహమ్మద్, లతా మంగేష్కర్)

(original song)

Mausam hai ashikaana
Ai dil kahin se unako aise men dhundh laana

Kahana ke rut jawaan hai, aur ham taras rahe hain
Kaali ghata ke saaye, birahan ko das rahe hain
Dar hai na maar daale, saawan ka kya thhikaana

Suraj kahin bhi jaaye, tum par na dhup aye
Tum ko pukaarate hain, in gesuon ke saaye
A jaao main bana dun, palakon ka shaamiyaana

Firate hain ham akele, baahon men koi le le
Akhir koi kahaan tak tanahaaiyon se khele
Din ho gaye hain jaalim, raate hain kaatilaana

Ye raat ye khaamoshi, ye khwaab se najaaren 
Juganu hain ya jaminpar utare huye hain taaren 
Bekhaab meri ankhe, madahosh hai jmaana

(“Pakeeja” (1971), Kamaal Amrohi, Gulam Mohammad, Lata Mangeshkar)

No Comments

Post A Comment

You don't have permission to register