‎Paresh Doshi‎

_Paresh Doshi_

‎Paresh Doshi‎

స్వరాలు తొడిగిన కవిత — 93

(ఈ తడిసిన ఋతువులో మంటలనే రాజేసిన జల్లు!)

సమయానికి తగు పాట పాడాలి. బయట ప్రతి సాయంత్రమూ పడే వాన, యెన్నో వాన పాటలను గుర్తు చేస్తోంది. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటొకటి ఈ వారం. దీని అర్థం మీద, పదాల మీద ధ్యాస పెట్టకపోయినా ఆర్ డీ బర్మన్ తన వరుసతో మనల్ను యెక్కడికో లాక్కు పోతాడు. రెంటిలో కిశోర్ పాట కాస్త యెక్కువ నచ్చినా దేనికదే ప్రత్యేకం. కిశోర్ పాట కన్నా లత పాటలో లయ వేగం యెక్కువ. కొన్ని అందమైన గమకాలు అదనం. కాని కిశోర్ పాటలో ఎక్స్ప్రెషన్లు బాగా పలికాయి. ఇది నా అభిప్రాయం. మీరైతే రెండూ విని మీ అభిప్రాయాలకు రండి. ఆనందించడం అయితే ఖాయం.

వాన ఈ నేలను తడిపేసి, కొత్త పచ్చదనాలకు ప్రాణదాత అయి, యేర్లు, నదులు పొంగించి ప్రతి జీవ జాలాన్ని బతికిస్తుంది. అయితే మనిషికి, కవికి, ప్రేమికునికి ఇది ప్రత్యేకంగా వొక ఉనికిని ఇస్తుంది. చల్లని మంటలను యెగదోస్తుంది, వేడి నిట్టూర్పులను చల్లారుస్తుంది. కళ్ళల్లో కలలను నింపుతుంది. శ్వాశలో గమకాలను నింపుతుంది. ప్రియురాలి అందెల ధ్వనులలా భ్రమింప చేస్తుంది. యవ్వనాలను తిరిగి తెస్తుంది. మనసంతా ప్రేమతో తడిపేస్తుంది. వాన యేమైనా చేస్తుంది!

యోగేశ్ పాటలు గుల్జార్ పాటలలాగే ప్రత్యేకంగా వుంటాయి. ఆ వూహలు, ఆ అభివ్యక్తి. కవిత్వానికి మరింత దగ్గరగా. అందుకే అవి మరచిపోవడం కష్టం. హిందీలో వాన పడేటప్పుడు రింఝిం ధ్వనులని, టిప్ టిప్ ధ్వనులని సంకేతాలుగా వాడుతారు. మనం యెండ ఫెళఫెళ లాడుతుంది, వర్షం భోరున పడుతుంది అన్నట్ట్లు. అయితే కవి వొక చోట వాన చినుకులు గజ్జెలలా, అందెలలా చప్పుడు చేస్తూ పడుతున్నాయి అంటాడు. అది ఆ శాబ్దిక పోలిక తో పాటు, ప్రియురాలిని తలచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే పాటలో రింఝిం కి ఘల్లు ఘల్లు అని తెనిగించాను. కురుస్తున్న వాన హృదయంలో ప్రేమాగ్ని రేపుతోంది. పరస్పర విరుధ్ధమైన క్రియలు. వాన గుణం మంటలను ఆర్పడం, మరి ఇక్కడ మంటలను యెగదోయడమేమిటి? శ్రావణ భాద్రపద మాసాలలో మబ్బు పట్టిన ఆకాశం, భోరున కురుస్తున్న వానల వల్ల యేకంగా ఋతువే తడిసిన ఋతువంటాడు కవి. అలాంటి ఋతువులో యెదలో కుంపట్లు రాజేసే జల్లులు. మనసులో పుట్టే కోరికలు కూడా రెప్ప వాల్చట్లేదట! కోరికలకే కళ్ళుండి, అవి దేని కోసమో యెదురు చూస్తూ వున్నాయి రెప్పైనా వేయకుండా! అలాగే ప్రేమికుని కలలు కంటున్నా కళ్ళు కూడా ఆ మంటలకు ఆజ్యం పోస్తున్నాయి.

పైది అతని మనసులో మాటైతే, ఆమె కూడా విస్తుపోతుంది. నిరుడుదాకా కురిసిన మేఘాలే, తడిసిన తన కొంగే; మరి ఈ యేడు ఈ మార్పెందుకని వచ్చిందో? ఇదివరకెన్నడూ లేనిది ఈ సారి వాన జల్లులు మంటలను రేపుతున్నాయేమి అని ఆశ్చర్యం. తనకే ప్రేమ మైకం కమ్మింది అని గ్రహించలేని పిచ్చిది దోషం ప్రకృతి మీద వేస్తుంది. స్వభావ విరుధ్ధంగా వాన మంటలను రేపడం, ఋతువు మత్తిల్లి వుండడం, గాలి తాగేసి వూగిపోవడం వగైరాలు. బహుశా వాన పిచ్చి కూడా పట్టిస్తుందేమో!

ఈ మంజిల్ అనే సినెమా చూడలేదు. చిన్నప్పటినుంచి రేడియోలో ఈ పాటలు విని విని కంఠస్థం. ఈ మధ్య వీడియోలు చూసి ఆ చిత్రీకరణను, ముఖ్యంగా ఆ అందమైన మౌసమీ చటర్జీని, అమితాభ్ ని చూసి ఆనందించా. అవును, ఈ పాటలు చూసి కూడా ఆనందించవచ్చు.

“రింఝిం గిరే సావన్ సులగ్ సులగ్ జాయే మన్” (మంజిల్)

(కిశోర్ పాట)

ఘల్లు ఘల్లు మని కురిసే జల్లు, 
యెదలో మంటలను యెగదోసే జల్లు,
ఈ తడిసిన ఋతువులో మంటలనే రాజేసిన జల్లు!

వాన అందెలు ఘల్లు ఘల్లు మన్నప్పుడు
ఈ మనసు కోరికలు రెప్పైనా వాల్చవు
యెలాంటి స్వప్నాలు కంటున్నాయో గాని
యెదలో మంటలను యెగదోశాయి ఈ కళ్ళు!

నిండు సభలో ఆమెకెలా చెప్పేది?
ఆ అపరిచిత మనసుతో నా మనసు ముడిపడిందని!
అయ్యో, ఇప్పుడేం జేతు! 
యెదలో మంటలను యెగదోసే జల్లు!

(“మంజిల్” (1979), యోగేశ్, ఆర్ డీ బర్మన్, కిశోర్ కుమార్)

(లత పాట)

ఘల్లు ఘల్లు మని కురిసే జల్లు, 
యెదలో మంటలను యెగదోసే జల్లు,
ఈ తడిసిన ఋతువులో మంటలనే రాజేసిన జల్లు!

ఇదివరకు కూడా మేఘాలు కురిశాయే!
ఇదివరకు కూడా ఈ కొంగు తడిసిందే!
మరి ఈ యేడు యెందుకని లోలోన లేచాయి మంటలు?
ఈ తడిసిన ఋతువులో మంటలనే రాజేసిన జల్లు!

ఈ సారి వర్షమూ మండిపోతోంది
ఈ సారి ఋతువూ మత్తుకొని వున్నది
యే మద్యం తాగిందో మరి
గాలికూడా విసురుగా మంటలను యెగదోస్తోంది!
ఈ తడిసిన ఋతువులో మంటలనే రాజేసిన జల్లు!

(“మంజిల్” (1979), యోగేశ్, ఆర్ డీ బర్మన్, లతా మంగేష్కర్)

(original song)
(Male version)

Rimajhim gire saawan, sulag sulag jaaye man
Bhige aj is mausam men lagi kaisi ye agan

Jab ghungaruon si bajati hain bunde
Arama hamaare palaken na munde
Kaise dekhe sapane nayan, sulag sulag jaaye man

Mahafil men kaise kah de kisi se
Dil bandh raha hai kisi ajanabi se
Haay kare ab kya jatan, sulag sulag jaaye man

(Manjil (1979), Yogesh, R D Burman, Kishore Kumar)

(Female version)

Rim jhim gire sawan
Sulag sulag jaaye man
Bheege aaj is mausam mein
Lagi kaisi yeh agan.

Pehle bhi yun to barse the baadal
Pehle bhi yun to bheega tha aanchal
Ab ke baras kyun sajan
Sulag sulag jaaye man
Bheege aaj is mausam mein
Lagi kaisi yeh agan

Is baar sawan dehka hua hai
Is baar mausam behka hua hai
Jaane pee ke chali kya pawan
Sulag sulag jaaye man
Bheege aaj is mausam main
Lagi kaisi yeh agan

Rim jhim gire sawan
Rim jhim gire sawan.

(Manjil (1979), Yogesh, R D Burman, Lata Mangeshkar)

No Comments

Post A Comment

You don't have permission to register