‎Narayanaswamy Venkatayogi‎

nara

‎Narayanaswamy Venkatayogi‎

మనల్ని వదలి వెళ్ళిపోయిన వాళ్ళ విషాద స్మృతులు సమార్ కవితలు

1985 లో జన్మించిన సమార్ అబ్దెల్ జాబెర్ బీరుట్ అరబ్ విశ్వవిద్యాయలయం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నది. ప్రస్తుతం దుబాయి లో ఉద్యోగం చేస్తున్నది. 2008 లో తన మొదటి కవితా సంకలనం ‘వేరే లెక్కలున్నాయి’ ని ప్రచురించింది. అదే యేడాది దామాస్కస్ సిరియా లో జరిగిన కవితోత్సవం లో పాల్గొన్నది. దామస్కస్ లోని డేనిష్ సంస్థ ఆమె కవిత్వానికి అరబ్ వసంతమూ, యువతపై దాని ప్రభావమూ గురించి అద్భుతంగా ప్రతిఫలించిన కవిత్వంగా ఆమెను గుర్తించింది. తర్వాత కోపెన్హెగెన్ లో జరిగిన సాహిత్యోత్సవం లో పాల్గొన్నది.

సమార్ రెండో పుస్తకం ‘మనమే దయ్యాలమైతే? ‘ 2013 లో ప్రచురితమైంది. యే యెమ్ ఖట్టన్ ఫౌండేషన్ ఇచ్చే పాలస్తీనా యువరచయిత అవార్డు పొందింది. తర్వాత అదే సంస్థ చేసిన ధన సహాయం తో ‘మర్చిపోయిన గ్రహం’ కవితా సంకలనాన్ని ప్రచురించింది. summer-blues.blogspot.com , tholatheyyat.blogspot. com లలో తన బ్లాగుల్ని రాస్తుంది.

సమార్ కవిత్వం లో ఒక స్ఫటికంలాంటి స్పష్టత, సరళత, వాటిలో అద్భుతంగా ప్రతిఫలించే వివరాలు, అంతర్దృష్టి మనకు కొట్టొచ్చేటట్టు కనబడతాయి. నిజాయితీ, సౌమ్యత, అణకువ లతో ఉట్టిపడే సమార్ కవితల స్వరం వెనుక ఒక యాభై ఏండ్ల అనేక కష్టానష్టాలకోర్చిన పాలస్తీనా సమాజపు విస్తారమైన అనుభవమున్నది.

విషాదగీతం 
————–

తన చిట్టచివరి ఆశ్రయం,
సమాధిలో విశ్రమిస్తున్న 
మా తాతగారికి 
ఓ విషాదగీతం.

రేపు ఉదయాన్నే 
వాడకట్టులో 
ప్రతిధ్వనించే మసహరాటి 1 లో 
నీ పేరు ఇంక పిలవరు

గోడకు ఒరిగిన 
చేతికర్ర 
నీ కోసమే ప్రతిరోజూ 
మరింతగా ఎదిరిచూస్తుంది

నేను మళ్ళీ 
ఊరొచ్చినప్పుడు
నీ మృదుగంభీరమైన గొంతు 
పాలస్తీనా కథలు
ఇంక వినిపించదు

నువ్వే ఈద్ వు కాబట్టి, 
ఇంక ఈద్ లుండవు 
ముందు ముందు

నిన్న హటాత్తుగా 
నీ గుండె కొట్టుకోవడం 
ఆగిపోయినప్పుడు, 
హైఫా 2 కు ఎట్లనో 
యే దూరదృష్టితోనో 
తెలిసిపోయింది

యేదో నిగూఢమైన గాలి 
హటాత్తుగా 
దాడి చేసింది
సముద్రం అట్టడుగున ఉన్న 
రాళ్ళు తేలుతూ 
నీ వైపు రావడం మొదలుపెట్టినయి 
చెట్లన్నీ తమ వేర్లతో సహా 
పెళ్ళగించుకుని
నీ కోసం వొచ్చేసినయి

నీవుండిన ఇంట్లో 
హటాత్తుగా 
చీకటి ఆవరించింది 
అక్కడుండబోయే వాళ్ళకు 
చిరకాల శాపం లా

నిన్నటి రాత్రి 
హైఫా లో 
చంద్రుడు మబ్బుల వెనక దాక్కున్నాడు 
సూర్యుడు అలసిపోయి నిద్రలేచాడు

నువ్వు నీ పడకకు వీడ్కోలు చెప్తావు 
చివరిసారిగా ….
ఎవరి బుజాలమీదో 
కళ్లుమూసుకుని

మెల్లిగా నీ శరీరం 
సమాధిలోనికి దింపబడుతుంది 
విషాదపు ఇసుక నీ మీద 
చల్లుతారు

ఎవరో నీ పేరు 
సమాధిరాయి మీద 
అతిజాగ్రత్తగా చెక్కుతారు

రహస్య వర్షం 
కురుస్తుంది యెడతెరపిలేకుండా
నీ సమాధి మీద….

నీ శరీరం 
కాందిశీక సమాధి లో
కలిసిపోతుంది

అదే క్షణం 
నీ కళ్ళలాంటి 
అందమైన నీలికళ్లతో,
నీ పేరులాంటి 
గంభీరమైన పేరు తో
ఓ అందమైన శిశువు 
జన్మిస్తుంది.

1. మసహరాటి – రంజాన్ నెలలో ఉదయానికన్న ముందు పిలుపు 
2. హైఫా – ఆక్రమిత పాలస్తీనా లో ఒక పట్టణం 
(మర్చిపోయిన గ్రహం – కవితా సంకలనం నుండి )


చనిపోయిన వాళ్ళు
———————

చనిపోయిన వాళ్ళు బాగున్నారు 
మామూలు కన్నా –

ఊరికే వాళ్ళను ఊహించుకుని, 
నిన్ను కోల్పోతున్నారనుకోకు 
దయచేసి .

రాత్రి పూట నీ కిటికీ ని 
ఊపెసేది 
హేమంత గాలి, 
వాళ్ళ చేతులు కావు.

చదువుకునే గదిలోనుంచి వచ్చే 
చప్పుడు 
పాత పుస్తకాల మధ్య ఇల్లు కట్టుకుంటూ 
యేదో పురుగు చేసేది.

వాళ్ళు కనబడే 
నీ కలలు
ఉట్టి నీ ఊహల్లో కల్పించుకున్నవి

చనిపోయిన వాళ్ళంతా 
వాళ్ళ వాళ్ళ సమాధుల్లో 
ఇళ్ళలో ఉన్నట్టు ఉన్నరు

రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటున్నరు 
వారి వారి వ్యక్తిగత విషాదాలను 
కథలుగా. 
మనల్ని వెక్కిరిస్తున్నరు, 
నవ్వుతున్నరు 
వాళ్ళ అప్పటి చిన్న చిన్న కష్టాలని గుర్తు తెచ్చుకుని.

ఈ లావుపాటి బండరాళ్ళ వెనక ఉన్న 
చనిపోయిన 
నీవాళ్లు 
నీ ముఖాలను చూడలేరు

ప్రతి యేడాది వాళ్ళ సమాధుల్ని దర్శించుకుని 
నీవు చెప్పే ఒక్క మాటా 
వాళ్ళకు వినబడదు

నీవు తెచ్చే అందమైన పూల గుత్తుల 
సువాసనలూ వాళ్ళనంటవు

చనిపోయినవాళ్లు 
కాలం తో పాటు 
నిన్నూ మర్చిపోతారు.

(మనమే దయ్యాలమైతే? అనే కవితా సంకలనం నుండి )

No Comments

Post A Comment

You don't have permission to register