‎LN Gunturu‎

_LN Gunturu_

‎LN Gunturu‎

60వ భాగం

‘నన్ను మెచ్చుకున్నవాళ్ళంతా నా రచనలు అర్ధం చేసుకున్నారని భ్రమ పడ్డాను’ అంటాడు చలం ఒక సందర్భంలో. చాలామంది కవులకు కూడా ఇది వర్తిస్తుంది. అజంతా ,వేగుంట మోహన ప్రసాదులు కూడా తమ కవిత్వం తమను ఆకాశానికెత్తే వాళ్ళకందరికీ సరిగా అవగతమయ్యిందని చెప్పలేమని అంటూండేవారు. సీతారాం, అఫ్సర్ ల అభిమానులందరికీ వారి కవిత్వం పూర్తిగా అర్థమై ఉండకపోవచ్చని ఆ అభిమానులు మాట్లాడే మాటలూ , రాసే రాతలూ కొన్నిసార్లు రుజువు చేశాయి. కవిత్వాన్ని అర్ధం చేసుకోలేకపోవటానికీ సంబందిత కవుల్ని మెచ్చుకోవటానికీ ఉన్న కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న చాలా సార్లు నాకు ఎదురయ్యింది.మీలో చాలామందికి ఈ ప్రశ్న తారసపడి వుంటుందనే అనుకుంటున్నా.

అర్ధం కానప్పటికీ ఆకర్షించే గుణం ఏదో కవిత్వంలో ఉండి ఉండాలి. లేదూ కవిత్వంలోని విషయం జోలికిపోకుండా కేవలం వ్యక్తీకరణకి లొంగిపోయే పాఠకుల ధోరణైనా కారణమై ఉండాలి.తమని అబ్బురపరిచే వాక్యాల కళా కౌశలంలో పడి ఆ వాక్యాల వెనకున్న ఉద్దేశ్యాన్ని పట్టించుకోనితనం చాలామంది పాఠకుల్లో బయటపడుతూ ఉంటుంది.పాఠకుల ఈ ధోరణి కొత్త వ్యక్తీకరణలకీ ప్రయోగాత్మక శిల్పాలకీ మాత్రమే పరిమితమై లేదు.కాలం చెల్లిన సాంకేతిక విశేషాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పటికీ యతులూ ప్రాసాలూ చూసి ముచ్చటపడే వారు ఉన్నారు. చిత్రబంధ కవిత్వాలతో తన్మయత్వం చెందేవాళ్ళూ వున్నారు. పోలికలూ, ప్రతీకలూ కనిపించిన ప్రతిసారీ పరవశులై విషయాన్ని పట్టించుకోని వాళ్ళున్నారు. హెవీ డిక్షన్ , outdated గ్రాంధికీకరణ, కవిత్వ భాష పేరుతో చలామణీలో ఉన్న అరిగిపోయిన పదబంధాలూ పలుకుబడులూ చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యే పాఠకులూ వాటిని ప్రమోట్ చేసే విమర్శకులూ వున్నారు.

Ulysses, Finnegans Wake లలో తన ప్రయోగాత్మక టెక్నిక్ ను చూసి పొగిడిన పెద్ద పెద్ద విమర్శకులూ పాఠకులూ తాను చర్చించిన విషయాలను చర్చలోకి తేకుండా అన్యాయం చేశారని జేమ్స్ జాయిస్ మధన పడ్డాడు. Wallace Stevenson , TS ఎలియట్, WB Yeats, Neruda, Allen Gibson, Transtromer, Derek Walcott ,Amiri Baraka లాంటి మహామహులు ఇలా వాపోయిన వాళ్లే. శ్రీశ్రీ మరో ప్రస్థానం ను కొట్టి పారేసి మహా ప్రస్థానాన్ని హైలైట్ చెయ్యడంలో ఒక వర్గం విమర్శకుల పాఠకుల prejudice ఇమిడి ఉందని విప్లవ సాహితీ వేత్తలు ఆనాడు వాదించారు. జాషువా విషయంలోనూ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన పద్య రచనా కౌశల్యాన్ని పొగిడి ఆ పద్యాలలోని విషయాన్నీ తత్సంబందిత సామాజిక విశ్లేషణనీ పరిశీలనకు గురిచేసిన వాళ్ళు తక్కువ.

వస్తువుకు దూరంగా టెక్నిక్ తో దాని తాలూకు చమక్కులతో అలరించే అలవాటుకు గురైన కవుల లాగే, రీతి సొగసుల్లో సోలి ఇతివృత్తాన్ని విశ్లేషణాత్మకంగా చూడటానికి ప్రయత్నించని పాఠకులూ, అర్ధం కావటానికీ అప్రిషియేట్ చేయటానికీ మధ్య వచ్చే వైరుధ్యానికి కారకులే. సమాజంలోని ఏ సమూహానికీ ప్రత్యేకంగా సంబంధించని యూనివెర్సల్ కవిత్వాన్ని రాస్తున్నానుకునే కవులు ఈ దుస్థితికి మరింత కారకులు. ఎందుకంటే ఏదో ఒక ప్రత్యేక సామాజిక సమూహానికో విభాగానికో సొంతం కాకుండా వారి గుర్తింపునూ ప్రోత్సాహాన్నీ పొందకుండా ఏ కవులూ వుండరు.

No Comments

Post A Comment

You don't have permission to register