‎LN Gunturu‎

_LN Gunturu_

‎LN Gunturu‎

52వ భాగం

కవిత్వం నిలబడి ఉండటానికి మరో కారణం దానినుంచి విడదీయరాని క్లుప్తత. ఇతర ప్రక్రియల్లోకూడా క్లుప్తత వుండేమాట నిజమే కానీ కవిత్వ స్వభావం నుంచి దీన్ని వేరుచేయలేని స్థాయిలో ఇది ఇమిడిపోయింది. కవిత్వానికి సంక్షిప్తత ఆత్మవంటిదని అన్నవాళ్ళూ వున్నారు. Brevity is the soul of wit అనే భావం అలావచ్చిందే. వస్తు స్వభావం రీత్యా వ్యక్తీకరణ నిడివి పెరగటం తరగటం సాధారణం అయినప్పటికీ చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద భావాల్ని పలికించటంలో కవిత్వం ఎప్పుడూ ముందే.

ఫిజికల్ డీటెయిల్స్ ఇవ్వకుండా మినిమల్ వ్యక్తీకరణ ద్వారా ఊహల్ని అవధులు లేని స్థాయిలో విస్తరించడం క్లుప్తతకు చెందిన ఒకానొక మార్గం. హెలెన్ అందాన్ని గురించి ఏ భౌతిక విపుల సమాచారాన్ని ఇవ్వకుండా ఆమె అసాధారణ అందానికి సంబంధించిన ఊహల్లోకి పాఠకుల్ని తీసుకెళ్లిన వ్యక్తీకరణ చూద్దాం.

Was this the face that launched thousands of ships
And burnt the topless towers of Illiam

అని Christopher Marlowe అన్నప్పుడు హెలెన్ అందానికి చెందిన వర్ణన లేదు.ఆమె ముఖం, శరీర నిర్మాణాలకు చెందిన వివరణ లేదు. రెండే రెండు వాక్యాల ద్వారా ఆమె ముఖం కోసం యుద్ధాలు చేసి ఎంతమంది వినాశనం చెందారో ఎన్ని కట్టడాలు కూలిపోయాయో చెప్పాడు. దీన్నుంచే ఆమె అందానికి చెందిన వూహ మనలో విస్తరిస్తుంది. ఇక్కడ క్లుప్తతే కాదు విషయ పరిణామం నుంచి విషయ స్వభావాన్ని చెప్పే టెక్నిక్ కూడా ఇమిడి ఉంది.

Shakespeare ఒక చోట there is a method in his madness అంటాడు. Hamlet పాత్ర మీద మరొక పాత్ర చేత చెప్పించిన వ్యక్తీకరణ ఇది. ఇంత చిన్న వ్యక్తీకరణ లో ఎంత పెద్ద భావం ఉందో అర్ధం చేసుకోవడం సులువే.

నాగలి భుజాన వేసుకుని
పొలం వెళ్లే ప్రతి రైతూ నాకు
శిలువ మోస్తున్న జీసస్ లా కనిపిస్తాడు

అన్న నగ్నముని వ్యక్తీకరణలో ఎంత క్లుప్తత ఉందో ,ఎన్ని తక్కువ మాటల్లో ఎంత విస్తార ఆలోచన వుందో ఆలోచించండి. ఇస్మాయిల్ రాసిన ఈ చిన్ని కవితలో ఎంత లోతూ విస్తృతీ ఉందొ గమనించండి

నా కోసం పూర్తిగా 
నగ్నవైనప్పుడు మాత్రమే
నా దానివి

బట్టలు కట్టుకున్నాక
ప్రపంచపు దానివి

ఎప్పుడో ఒకనాడు
ప్రపంచాన్ని చింపి
పోగలు పెడతాను

ప్రపంచానికీ ప్రేమకీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని , వైరుధ్యాన్నీ అందులో వ్యక్తుల ప్రమేయాన్నీ ఒకతీసిస్ లాగా రాయగలిగినదాన్ని చిన్న స్పేసులో వ్యక్తం చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇలాంటి విలువైన వ్యక్తీకరణల్ని దృష్టిలో ఉంచుకుని క్లుప్తతని ‘infinite riches in a small room’ అని అభివర్ణించాడు ఓ ఆంగ్ల ఆలోచనాపరుడు.

Mountains will be in labour
And a ridiculous mouse will be born

అని గ్రీక్ మహాకవి Horace చెప్పినప్పుడూ ఎంత సంక్షిప్తత చోటుచేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. కొండను తవ్వి ఎలుకను బట్టిన చందంగా అని మనం వాడుతున్నదానికి దగ్గరగా సాగే పై రెండు వాక్యాలను వివరించటానికి చాలా చోటు కావాలి అని మనకు తెలుసు.

ముఖే ముఖే విషాదంలో
మొగుడూ పెళ్ళాం రెండు విషా దాలు
రెండు కలవని సముద్రాలు
దేని చుట్టూ అదే తిరిగే రెండు గోళాలు

అని కవి అన్నప్పుడు సకల భార్యా భర్తల సంబందాల్నీ అందులోని సక్లిష్టతల్నీ కుదించిన వైనం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కనుక అనంత భావాల్ని అతి కుదింపుకు లోబడి వ్యక్తం చేయగలగటం కవిత్వానికున్న మరో సానుకూలతగా మనం అంగీకరించక తప్పదు.

No Comments

Post A Comment

You don't have permission to register