‎LN Gunturu‎

_LN Gunturu_

‎LN Gunturu‎

53వ భాగం

ప్రస్తుతం వస్తున్న కవిత్వం ఎలా ఉంది? అని చాలామంది అడుగుతూ వుంటారు. ఈ ప్రశ్నకు నా ఇమిడియట్ రియాక్షన్: ఏ కవిత్వం గురించి మీరు అడిగేది? అని. అదేన్టీ అలా అంటున్నారు? అని అవతలి వాళ్ళు ఆశ్చర్యపోవటం సహజంగా జరిగిపోతుంది. దీన్నిలా ఇక్కడ ఆపితే, ఏ కవిత్వం ఎవరి కవిత్వం అనేది ఉంటుంది కానీ అందరికీ చెందిన ఒకే కవిత్వం ఉండదని నా అభిప్రాయం. అందరికీ చెందిన ఒకే వాస్తవికత ఎలా ఉండదో అందరికీ చెందిన కవిత్వమూ ఉండదు.

కొన్నేళ్ల క్రితం స్త్రీవాద స్టార్ కవి జయప్రభ’ పైటను తగలెయ్యాలి’ అని ఒక కవిత రాసింది. పైట స్త్రీల స్వేచ్ఛను ఎలాహరిస్తుందో చిత్రిస్తూ దాన్ని తగలెయ్యటం ఎంత అనివార్యమో నిర్థారిస్తూ కవితను ముగించింది కవి. ఇందుకు భిన్నంగా జూపాక సుభద్ర పైట బరువును మోసే గ్రామీణ దళిత స్త్రీకి తలగుడ్డగా ఎలా ఉపయోగపడుతుందో, ఎండ నుండి చీర కొంగు ఎలా కాపాడుతుందో, బాధల్లో కన్నీళ్లు తుడుచుకోటానికీ , శ్రమలో చమట తుడుచుకోటానికీ ఎలా ఉపయోగపడుతుందో వర్ణించింది. పైటకే అవకాశం లేనివాళ్ళు దాన్ని తగలేయటమా ఉంచుకోవటమా అనే స్పృహ లేకుండానే బతుకుతారని రాసిన వాళ్ళూ వున్నారు. పైటకు చెందిన ఇద్దరు ప్రముఖ కవుల స్పందనలు ఇంత భిన్నంగా ఎందుకున్నాయని చూస్తే ఆ ఇద్దరికవుల వాస్తవికత తాలూకు విభిన్నతే దానికి కారణమని తెలుస్తోంది. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాదుగానీ ,బ్రాహ్మణ కులానికీ మధ్య తరగతికీ చెందిన స్త్రీ పైటను సంకెళ్లుగా కట్టుబాటుగా హిందూ ఆచార ప్రతీకగా భావించటం ఎంత సహజమో , గ్రామీణ పేద దళిత స్త్రీ తన వంటిమీది చీరను తన దైనందిన జీవన నేపధ్యం నుంచి , అనుభవాల నుంచీ, శ్రమ అవసరాలనుంచీ ఆహ్వానించటం అంతే
సహజం. వారి వైఖరుల వ్యత్యాసం వెనుక వారి వాస్తవికతల వ్యత్యాసం ఉన్నది. వారి ఈస్థటిక్స్ వెనుక గూడా వారి నిర్దిష్ట వాస్తవికత ఉంది.

ఇలాగే మాకొద్దీ తెల్లదొర తనమని గరిమెళ్ళ గళమెత్తితే, మాకొద్దీ నల్ల దొరతనమని కుసుమ ధర్మన్న నినదించాడు. విశ్వనాథ సత్యనారాయణ కులవ్యవస్థను కీర్తిస్తూ వేయి పడగలుగా అభివర్ణిస్తే అదే కుల వ్యవస్థను దళితుల పాలిట పీడక వ్యవస్థగా నిరూపిస్తూ, “కసరి బుస కొట్టునాతని గాలిసోక /నాల్గుపడగల/ హైందవ నాగరాజు” అని రాసాడు మహాకవి జాషువా.దేశాన్ని గురించి రాస్తూ

ఏదేశమేగినా ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతినీ

అని రాయప్రోలు రాసిన విషయం మనకు తెలుసు. ఇదే భూమి భారతి గురించి జాషువా ఏమన్నాడో చూడండి.

ఇది భయంకర దేశము
వర్ణభేదముల్ గూడలు గట్టుకున్నవనరాదు కాని
పంచమ జాతి వారికిన్ కూడు హుళక్కి
మానవతగూడ హుళక్కి, హుళక్కి జన్మమున్

మాతృ దేశాన్నిగురించి ఇద్దరు కవులు విభిన్నంగా వైరుధ్యపూరితంగా రాయడానికి కారణం వారి విభిన్న సామాజిక వాస్తవికతలే అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

కులాన్ని గాంధీ శ్రమ విభజనగా నిర్వచించిన సందర్భంలో అంబేద్కర్ దాన్ని శ్రామికుల విభజనగా విశ్లేషించి నిరూపించాడు. పారిశ్రామికీకరణ పెరిగే కొద్దీ కులం అంతర్ధానమయ్యే అవకాశం ఉందని మార్క్స్ అభిప్రాయపడటాన్ని తప్పుపడుతూ భారతదేశంలో పారిశ్రామికీకరణ కులవ్యవస్థ కనుసన్నల్లోనే వేళ్లూనుకొని వృద్ధి చెందుతున్న తీరును అంబేద్కర్ విస్తార విశ్లేషణకి గురిచేశాడు. విద్యకున్న కుల స్వభావాన్ని పూలే ఎప్పుడో తన రచనల్లో రూపుకట్టాడు.

భారతీయ వాస్తవికతకి చెందిన ఈ విభిన్న దృక్పధాలు సాహిత్యంలో ప్రతిబింబించటం ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో ఆసాంతం గమనించొచ్చు. అభ్యుదయ, విప్లవ కవులు మార్క్సిస్టు దృక్పధం వెలుగులో వర్గ నిర్మూలన గురించి కవిత్వం రాశారు. దళిత బహుజన వాద కవులు అంబేడ్కరిస్టు దృక్పధం వెలుగులో కుల నిర్మూలన గురించి దృష్టి సారించారు. ‘పేదవాళ్ళంతా ఒకటి బాధలన్నీ ఒకటీ’ అన్న మార్క్సిస్టు సాహిత్య ధోరణిని ఒప్పుకోకుండా ‘పేదవాళ్ళలో పెద్దకులస్తుల పెత్తనాల తీరే వేరయా’ ‘బాధల్లోన మాల మాదిగల బాధలు ఎవరికీ రావయా’ అనే అంబేడ్కరిస్టు చూపును పీడితకులాల సాహిత్యం ముందుకు తెచ్చింది. అందుకే ఎంత విప్లవ కవులైనా బాల్యాన్నీ, గ్రామజీవితాన్నీ సౌందర్యీకరిస్తే , దళిత కవులు బాల్యంలోని అవమానాల్నీ, గ్రామజీవితంలోని కుల క్రౌర్యాన్నీ ఏకరువు పెట్టారు. ఈ క్రమం నుంచే రాజ్య హింసను విప్లవ కవులు బోనులో ఎక్కించటం చేశారు. కుల ప్రేరేపిత సాంఘిక హింసను దళిత బహుజన కవులు దునుమాడారు. పేద వాళ్ళలోని కుల అసమానత్వాలనీ, బాధల్లోని కులాధార తారతమ్యాల్నీ సునిసితమైన విశ్లేషణకి గురిచేస్తూ ఈ కవులు రాసిన కవిత్వం కొత్త ప్రశ్నల్ని తెరమీదికి
తెచ్చింది.

ఈ చర్చ మొత్తంలో తేలేదేంటి. అందరికీ చెందిన ఒకే కవిత్వం ఉండదని. కులాన్నీ, వర్గాన్నీ, మతాన్నీ, ప్రాంతాన్నీ,జెండర్నీ, దృక్పధాన్నీ, వ్యక్తిగత టెంపెరమెంట్నీ , రాస్తున్న కాలాన్నీ బట్టి కవిత్వం మారుతుంది. కవిత్వ పఠనం, పఠన అభిరుచి కూడా ఇలానే రూపొందుతాయి. దీనికి సంబంధించిన మరింత కాంక్రీట్ చర్చ తిరిగి కొనసాగిద్దాం.

No Comments

Post A Comment

You don't have permission to register