మెట్టానాగేశ్వరరావు రవి

#నాన్నచేతులు*మా తాటాకిల్లునుకొత్తాకులతో కుట్టడానికితాటినార లాగుతున్నప్పుడు చూశానునాన్నచేతుల్ని....!
m

మెట్టానాగేశ్వరరావు రవి

#నాన్నచేతులు*

మా తాటాకిల్లును
కొత్తాకులతో కుట్టడానికి
తాటినార లాగుతున్నప్పుడు చూశాను
నాన్నచేతుల్ని….!
మొనగాడు మోయలేనంత మోపునారని
చిటికెలో లాగేసినపుడు బైటపడింది
గుడిసెలోని పేదరికం తడవకూడదన్న నాన్నకోరిక!

నాన్నకు చేతులే ధైర్యం..
చిరిగిన బట్టలేసుకున్న బతుకే అయినా…
చింతపడనిదీ చేతుల వల్లే…
ఆయన చేతులతో విత్తిన మిరపవిత్తనాలు
గుత్తులుగుత్తులై కల్లాన్ని ఎర్రగా మెరిపించేవి…
నాన్న చేతులకు తెగిన గడ్డి తిని
గేదెలు నిండుగ పాలిచ్చి కృతజ్ఞత చెప్పేవి..
ఆయన నరికిచ్చిన ముంజెలతీయదనం
నాల్కనుంచి ఇంకా చెరిగిపోలేదు….
నాన్న నరికి తెచ్చిన కట్టెలైతేనే
జ్వలనుడు ఎగబడి ఆకలినాల్కలు చాచేవాడు
అమ్మకళ్లలో ఎపుడూ కన్నీళ్లమేఘం దిగలేదు
నాన్న చేతులకష్టం దిగనివ్వలేదు..!

నాన్నచేతుల్ని వర్ణించాలంటే..
బృహత్కావ్యమే తయారవుతుంది…
ఆ చేతులు
ఎవరి బతుకుల్లో ముళ్లు పోయలేదు
చేతనైనంతలో
ఎదుటి ముఖాన జారే బాధను తుడవడం తప్ప!

ఇపుడు…
నాన్నచేతులు లేవు…
ఆయన చేతలు మాత్రం
ఇంకా ఇక్కడి గాలిలో ధ్వనిస్తున్నాయి..!

నా తప్పడుగుల్ని సరిజేసి
నడిపించిన నాన్నచేతులిపుడు లేవుగానీ..
నా తలమీద
ప్రేమార తాకిన స్పర్శమాత్రం రక్తంలో ఇంకింది!

#మెట్టానాగేశ్వరరావు*

No Comments

Post A Comment

You don't have permission to register